6 ఏళ్ల తర్వాత నితీశ్‌, లాలూతో సోనియా గాంధీ భేటీ!

25 Sep, 2022 08:43 IST|Sakshi

న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని విపక్ష పార్టీలు ఏకమవుతున్నాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే లక్ష్యంగా బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కానున్నారు నితీశ్‌ కుమార్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌. సుమారు ఆరేళ్ల తర్వాత నితీశ్‌, లాలూతో సోనియా గాంధీ సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. 

ఇండియన్‌ నేషనల్‌ లోక్‌ దళ్‌(ఐఎన్‌ఎల్‌డీ) వ్యవస్థపాకులు దివంగత నేత చౌదరీ దేవి లాల్‌ జయంతి సందర్భంగా ఫతేబాద్‌లో నిర్వహించే ర్యాలీలో పాల్గొనేందుకు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు ఇరువురు నేతలు. గత మంగళవారమే.. సోనియాతో భేటీపై వివరాలు వెల్లడించారు లాలూ ప్రసాద్‌ యాదవ్‌. ‘ప్రతిఒక్కరు అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. 2024 ఎన్నికల్లో బీజేపీని కూకటి వేళ్లతో పెకిలించాలి. నేను ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలవనున్నాను. పాదయాత్ర తర్వాత రాహుల్‌ గాంధీతోనూ భేటీ అవుతాను.’ అని తెలిపారు ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌.

ఇదీ చదవండి: రేణిగుంటలో భారీ అగ‍్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన ప్రైవేటు క్లినిక్‌

>
మరిన్ని వార్తలు