దేశాన్ని విడదీస్తోంది

17 Apr, 2022 06:33 IST|Sakshi

బీజేపీపై సోనియా నిప్పులు

మత దురభిమానమూ బీజేపీ పాపమే

ద్వేషం, అసహనమే దాని ఆయుధాలు

అడ్డుకోకుంటే సామాజిక పతనమే

న్యూఢిల్లీ: విద్వేషం, మత దురభిమానం, అసహనం వంటి చెడు ధోరణులు దేశాన్ని నానాటికీ విడదీస్తున్నాయని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ఈ ధోరణికి తక్షణం అడ్డుకట్ట వేయకపోతే సమాజం తిరిగి బాగు చేయలేనంతగా పాడవటం ఖాయం. తరాల తరబడి కష్టించి నిర్మించుకున్న విలువలన్నింటినీ ఈ విద్వేషాగ్ని భస్మీపటలం చేస్తుంది’’ అని హెచ్చరించారు.

ప్రజలే ముందుకొచ్చి ఈ విద్వేషపు సునామీని అడ్డుకోవాలని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు రాసిన వ్యాసంలో ఆమె పిలుపునిచ్చారు. ఇదంతా బీజేపీ పాపమేనని ఆరోపించారు. ‘‘భారత్‌ శాశ్వతంగా విభజనవాదంలో కూరుకుపోవాల్సిందేనా? ప్రస్తుత పాలకులు దీన్నే కోరుకుంటున్నారు. వస్త్రధారణ, ఆహారం, విశ్వాసాలు, పండుగలు, భాష వంటి అన్ని విషయాల్లోనూ పౌరులను పరస్పరం ఉసిగొల్పుతున్నారు. చరిత్రను వక్రీకరించి మరీ రెచ్చగొడుతున్నారు. అప్పడే తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేరతాయని భావిస్తున్నారు’’ అంటూ బీజేపీని దుయ్యబట్టారు.

అపారమైన వైవిధ్యానికి మన దేశం నిలయమని చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ, ప్రజలను విడదీసేందుకు ఆ వైవిధ్యాన్ని కూడా వక్రీకరిస్తున్నారన్నారు. ‘‘మైనారిటీలపై దాడులకు దిగేలా ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్నారు. వారిలో దుందుడుకుతనాన్ని, మత విద్వేషాన్ని పెంచి పోషిస్తున్నారు. మన ఉన్నత విలువలకు, సంప్రదాయాలకు పాతరేస్తున్నారు. పైగా అసమ్మతిని, భిన్నాభిప్రాయాలను ఉక్కుపాదంతో అణచేసే ప్రమాదకర ధోరణిని వ్యవస్థీకృతం చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలను రాజకీయ ప్రత్యర్థుల పైకి పూర్తిస్థాయిలో ఉసిగొల్పి వారిని నిత్యం వేధిస్తున్నారు. హక్కుల కార్యకర్తలను బెదిరించి నోరు మూయించజూస్తున్నారు.

విద్వేషపు విషాన్ని, పచ్చి అబద్ధాలను వ్యాప్తి చేయడానికి సోషల్‌ మీడియాను ఇష్టానికి దుర్వినియోగం చేస్తున్నారు’’ అని వాపోయారు. భయం, మోసం, బెదిరింపులే మోదీ ‘ఆదర్శ పాలన’కు మూలస్తంభాలుగా మారాయంటూ నిప్పులు చెరిగారు. ‘ఎక్కడైతే భయోద్వేగాలుండవో...’ అంటూ విశ్వకవి టాగూర్‌ రాసిన గీతాంజలి కవితా పంక్తులను ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరముందన్నారు. బీజేపీ, ఆరెస్సెస్‌ సంస్కృతి వ్యాప్తి చేస్తున్న విద్వేషాగ్నికి ప్రతి భారతీయుడూ మూల్యం చెల్లిస్తున్నాడని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అన్నారు. సోనియా వ్యాసాన్ని ట్విట్టర్‌లో ఆయన షేర్‌ చేశారు.

మరిన్ని వార్తలు