సోషల్‌ మీడియా సాయంతో... ఎన్నికల్లో అనుచిత లబ్ధి

17 Mar, 2022 05:16 IST|Sakshi

బీజేపీపై సోనియా, రాహుల్‌ ఆరోపణలు

ఆ పార్టీకి ఫేస్‌బుక్‌లో చౌకగా యాడ్స్‌

ఎన్నికల్లో ఫేక్‌ న్యూస్, విద్వేష ప్రచారం

అధికార పార్టీ, ఫేస్‌బుక్‌ లాభపడ్డాయి

అల్‌ జజీరా రిపోర్టును ఉటంకించిన సోనియా

ఈ ధోరణిని తక్షణం అడ్డుకోవాలని డిమాండ్‌

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా సాయంతో ఎన్నికల్లో అధికార బీజేపీ అనుచిత లబ్ధి పొందుతోందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ ప్రజాస్వామ్యాన్ని చెరపట్టేందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వంటి గ్లోబల్‌ సోషల్‌ మీడియా కంపెనీలను అధికార పార్టీ పథకం ప్రకారం పక్కాగా దుర్వినియోగపరుస్తోందని దుయ్యబట్టారు. సోనియా బుధవారం లోక్‌సభలో జీరో అవర్లో మాట్లాడారు.

‘‘ఈ సోషల్‌ మీడియా దిగ్గజాలు భారత ఎన్నికల రాజకీయాలను అనుచితంగా ప్రభావితం చేస్తున్నాయి. తద్వారా పాలక పక్షాలకు సాయపడుతూ తాము కూడా లబ్ధి పొందుతున్నాయి’’ అంటూ మండిపడ్డారు. ‘‘రాజకీయంగా జనాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా ప్రభావితం చేసేందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్‌ తదితరాలను అధికార పార్టీ వాడుకునే ధోరణి భారత్‌లో నానాటికీ పెరిగిపోతోంది. దీనివల్ల ఎన్నికల్లో కొన్ని పార్టీలకే అనుచిత లబ్ధి కలుగుతోంది’’ అని అల్‌ జజీరా రిపోర్టును ఉదహరిస్తూ ఆమె ఆరోపించారు.

ఎన్నికల ప్రకటనల కోసం ఇతర పార్టీల కంటే బీజేపీకి ఫేష్‌బుక్‌ చౌక డీల్స్‌ ఆఫర్‌ చేసిందనే రిపోర్టును ఉటంకిస్తూ చెప్పారు. ‘‘ఫేస్‌బుక్‌ వంటి గ్లోబల్‌ సోషల్‌ మీడియా కంపెనీలకు, అధికార పార్టీలకు మధ్య నెలకొన్న అనైతిక బంధానికి రిపోర్టు అద్దం పడుతోంది. ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా కంపెనీలు భావోద్వేగాలు దట్టించిన తప్పుడు సమాచారంతో పెద్దలతో పాటు యువత మనసులను పథకం ప్రకారం విద్వేషంతో నింపుతున్నాయి. అంతిమంగా ఈ ధోరణిని అటు అధికార పార్టీ ఎన్నికల్లో తనకు అనువుగా మలచుకుంటోంది.

ఇటు సోషల్‌ మీడియా కంపెనీలూ భారీగా లాభం చేసుకుంటున్నాయి. పాలక పక్షం దన్నుతో భారత సమాజంలో మత సామరస్యాన్ని ఫేస్‌బుక్‌ దారుణంగా చెడగొడుతోంది’’ అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ‘‘ప్రజాస్వామ్యానికి ఇది చాలా ప్రమాదకరం. సోషల్‌ మీడియా దుర్వినియోగం రూపంలో భారత ఎన్నికల రాజకీయాలకు ఎదురవుతున్న ఈ పెను ప్రమాదాన్ని తక్షణం అడ్డుకోవాలి’’ అని డిమాండ్‌ చేశారు. అధికారంలో ఎవరున్నారన్న దానితో నిమిత్తం లేకుండా ప్రజాస్వామిక, సామాజిక సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిమీదా ఉందన్నారు.

సోనియా ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా ఐటీ చట్టంలో 66ఏ సెక్షన్‌ ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛను హరించేందుకు ప్రయత్నించిందని ఆరోపించింది.

ఫేస్‌బుక్‌ ప్రజాస్వామ్యానికే చేటు: రాహుల్‌
సోనియా వాదనకు రాహుల్‌గాంధీ కూడా మద్దతు పలికారు. ఫేస్‌బుక్‌ను ప్రజాస్వామ్యానికే చేటుగా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు చేరువయ్యేందుకు బీజేపీకి ఫేస్‌బుక్‌ అనుచిత రీతిలో సాయపడిందని ట్విట్టర్‌లో తీవ్ర ఆరోపణలు చేశారు. అల్‌జజీరా, ద రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ రిపోర్టులను టాగ్‌ చేశారు. ఎన్నికల యాడ్స్‌ కోసం బీజేపీకి చౌక డీల్స్‌ను ఫేస్‌బుక్‌ ఆఫర్‌ చేసిందన్న సోనియా ఆరోపణను పునరుద్ఘాటించారు.

మరిన్ని వార్తలు