విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: సోనియా గాంధీ

29 Aug, 2020 19:21 IST|Sakshi

న్యూఢిల్లీ: విభజన శక్తులు దేశంలో విద్వేషాన్ని రెచ్చగొడుతూ భావ ప్రకటనా స్వేచ్చను హరిస్తున్నాయని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ శనివారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో ఇంతటి విపత్కర పరిస్థితులు, సంక్షోభం నెలకొంటాయని పూర్వీకులు, నాయకులు ఎవరూ ఊహించి ఉండరని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్‌లో నూతన అసెంబ్లీ భవన శంకుస్థాపన సందర్భంగా వీడియో కాల్‌ ద్వారా సోనియా గాంధీ హిందీలో ప్రసంగించారు. ఎక్కడా అధికార పార్టీ పేరు ప్రస్తావించకుండానే... కేంద్ర సర్కారుపై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు. (చదవండి: కాంగ్రెస్‌ విషయం తేల్చిపడేసిన ఆజాద్‌)

‘‘విష, విద్వేష సంస్కృతిని ప్రోత్సహిస్తున్న శక్తులు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. భావ ప్రకటనా స్వేచ్చను అణచివేస్తున్నాయి. భారత ప్రజలు, మన గిరిజనులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాలు నోరెత్తకుండా ఉండాలని కోరుకుంటున్నాయి. వాళ్లు జాతి మొత్తం మౌనంగా ఉండాలని కోరుకుంటున్నారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, బీఆర్‌ అంబేద్కర్‌ ఇలాంటి మహా నేతలు ఎవరూ దేశం ఇలా మారిపోతుందని ఎన్నడూ ఊహించి ఉండరు. 75 ఏళ్ల స్వతంత్ర భారతం ఇంతటి కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని అనుకొని ఉండరు. రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. నియంతృత్వ పోకడలు పెచ్చుమీరుతున్నాయి. ఇది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు’’ అని సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. (చదవండి: విద్యార్థుల బాధ‌ను అర్థం చేసుకోగ‌ల‌ను’)

కాగా కాంగ్రెస్‌ పార్టీలో ఇటీవల అంతర్గత విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ సమావేశం అనంతరం తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగేందుకు సమ్మతించిన సోనియా.. గత కొన్ని రోజులుగా మోదీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో నీట్‌, జేఈఈ పరీక్షలు నిర్వహించడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆమె.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.(చదవండి: అది విశ్వాసఘాతుకమే!)

మరిన్ని వార్తలు