గాంధీలదే కాంగ్రెస్‌..!

25 Aug, 2020 03:30 IST|Sakshi

అధ్యక్ష ఎన్నిక వరకూ పగ్గాలు సోనియా చేతిలోనే

ఏకగ్రీవంగా తీర్మానించిన సీడబ్ల్యూసీ సమావేశం

పార్టీని బలహీనం చేస్తే సహించేది లేదన్న తీర్మానం

తాత్కాలికంగా సద్దుమణిగిన తిరుగుబాటు

ఉదయం నుంచి హైడ్రామా

సీనియర్ల లేఖపై రాహుల్‌ ఫైర్‌

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీలో తిరుగుబాటు స్వరాలతో రేగిన ప్రకంపనలు పాలపొంగు మాదిరి చప్పున చల్లారిపోయాయి. పార్టీ తాత్కాలిక చీఫ్‌గా కొనసాగాలని, సంస్థను బలోపేతం చేయడానికి అవసరమైన మార్పులు తీసుకురావాలని సోనియాగాంధీని కోరుతూ సోమవారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. అనువైన పరిస్థితులు రాగానే ఏఐసీసీ సదస్సు ఏర్పాటు చేయాలని, అందులో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని... అప్పటిదాకా పార్టీ అధ్యక్షురాలిగా సోనియానే కొనసాగాలని ఆ తీర్మానంలో సీడబ్ల్యూసీ పెద్దలంతా స్పష్టంచేశారు. ఎక్కువ మంది సోనియా గాంధీకి మద్దతుగా నిలిచినప్పటికీ.. సమావేశంలో వ్యతిరేక స్వరాలు కూడా వినిపించాయి. పార్టీలో మార్పులు కోరుతూ సీనియర్లు లేఖ రాసిన సందర్భంపై రాహుల్‌ గాంధీ మండిపడగా... సమావేశంలో ఉన్న గులాం నబీ ఆజాద్‌ కూడా అదే రీతిలో స్పందించారు. సమావేశం బయట ఉన్న కపిల్‌ సిబల్‌ కూడా బహిరంగంగా ట్వీట్‌ చేశారు. కానీ కొద్దిసేపటికే పరిస్థితులు మారిపోయి తాత్కాలికంగానైనా అంతా ఒక్క చేతికిందికి వచ్చేశారు.  

ఉదయం నుంచి హైడ్రామా..
సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై ఏడు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో తొలుత సోనియా గాంధీ తాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. క్రియాశీలకంగా ఉండే, పూర్తి సమయం కేటాయించే అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ ఆగస్టు మొదటివారంలో పార్టీ సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్‌ శర్మ, కపిల్‌ సిబల్‌ తదితర 23 మంది నేతలు రాసిన లేఖపైనే ఈ సమావేశంలో చర్చ జరిగింది.

ఈ లేఖ రాగానే పార్టీలో మార్పుల గురించి చర్చించేందుకు సోనియాగాంధీ ఈనెల 20న పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాశారు. పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికపై చర్చ ప్రారంభించేందుకు వీలుగా సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో భాగంగా సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సమావేశంలో 52 మంది పాల్గొన్నారు.

ఒక్క తరుణ్‌ గొగోయ్‌ మినహా సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, ముఖ్యమంత్రులు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎక్కువ మంది సోనియా గాంధీకి మద్దతుగా నిలిచినప్పటికీ.. సమావేశంలో వ్యతిరేక స్వరాలూ వినిపించాయి. లేఖ రాసిన సమయం, సందర్భంపై రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. లేఖ రాసినవారు బీజేపీతో కుమ్మక్కయ్యారని కూడా ఆయన ఒకదశలో వ్యాఖ్యలు చేసినట్లు తెలియవచ్చింది.

దీనికి గులాం నబీ ఆజాద్‌ ఘాటుగా స్పందిస్తూ బీజేపీతో కుమ్మక్కయినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాలు విసిరినట్టు సమావేశంలో పాల్గొన్న సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు.   సోనియా గాంధీ ప్రారంభ ఉపన్యాసం అయ్యాక సీనియర్‌ నేతలు మన్మోహన్‌సింగ్, ఏకే ఆంటోనీ, అహ్మద్‌ పటేల్‌ మాట్లాడుతూ... సీనియర్ల లేఖను తప్పుపట్టారు. సోనియా గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొనసాగాలని మన్మోహన్‌సింగ్‌ ఆకాంక్షించారు. లేఖ రాసిన వారిపై ఆయా నేతలు విమర్శలు గుప్పించారు. కొత్త పార్టీ చీఫ్‌ను ఎన్నుకునేందుకు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని, అందుకు వర్చువల్‌ ఏఐసీసీ సెషన్‌ నిర్వహించాలని పి.చిదంబరం సూచించారు.  

సందర్భాన్ని తప్పుపట్టిన రాహుల్‌ గాంధీ  
పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ... లేఖపై సంతకం చేసిన వారిని ఘాటుగా విమర్శించారు. ముఖ్యంగా లేఖ రాసిన సమయాన్ని, సందర్భాన్ని తప్పుపట్టారు. సోనియాగాంధీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు, రాజస్తాన్‌లో పార్టీ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఈ లేఖ రాయడాన్ని తప్పుపట్టారు. దీనికి సంబంధించి సమావేశం పూర్తికాకముందే బయటకు లీకులు వెలువడ్డాయి. వీటి ఆధారంగా ఒక వార్తా సంస్థ చేసిన ట్వీట్‌ దుమారం రేపింది.

లేఖ రాసిన వారు బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్‌ గాంధీ మండిపడ్డారంటూ ఆ వార్తా సంస్థ చేసిన ట్వీట్‌కు కపిల్‌ సిబల్‌ ట్వీట్‌ ద్వారా సమాధానమిచ్చారు. పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా రంగంలోకి దిగారు. రాహుల్‌ గాంధీ అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని ఆయన ట్వీట్‌ చేశారు. మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. పార్టీలో ఒకరితోనొకరు గొడవ పడడానికి బదులు మోదీ పాలనపై కలసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.   

తాత్కాలికంగా సద్దుమణిగాయా?
పార్టీలో, సమావేశంలో ధిక్కార స్వరాలు వినిపించాయనడానికి పార్టీ నేతలు చేసిన ట్వీట్లు చాలు. రణ్‌దీప్‌ సూర్జేవాలా ట్వీట్‌లో ‘పార్టీ్టలో ఒకరినొకరు కొట్టుకునే కంటే మోదీ పాలనపై కలిసికట్టుగా పోరాడాలి’ అన్న వ్యాఖ్య అంతర్గత పోరు నిజమేనన్న సంకేతాన్నిస్తోంది. అలాగే తన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించారని, రాహుల్‌ని అనలేదని, ఇతర కాంగ్రెస్‌ నేతలను మాత్రమే అన్నానని ఆజాద్‌ చేసిన ట్వీట్‌ కూడా సమావేశంలో జరిగిన వాడీవేడిని బయటపెడుతోంది. ఇక బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్‌ అన్నట్టుగా వార్తలు వెలువడడంతో సిబల్‌ వెంటనే స్పందించి ట్వీట్‌ చేయడం కూడా అంతర్గత పోరుకు సంకేతమేనని చెప్పాలి.

ఈ నేపథ్యంలోనే అంతర్గత పోరు బహిరంగం కావడం, ఒక దశలో పార్టీలో దాదాపు 400 మంది సీనియర్లు మూకుమ్మడి రాజీనామాలు చేయబోతున్నారని ప్రచారం కావడంతో రాహుల్‌ గాంధీ స్వయంగా సిబల్‌తో మాట్లాడారు. తాను అలా అనలేదని చెప్పడంతో సిబల్‌ వెంటనే ట్వీట్‌ తొలగించారు. అలాగే లేఖ రాసిన వారిలో సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన వారు  ఆజాద్, ఆనంద్‌ శర్మ ఇద్దరే. సమావేశంలో వీరి వైఖరిని అహ్మద్‌ పటేల్‌ తదితరులు తీవ్రంగా ఆక్షేపించారు. లేఖను తయారు చేసింది ఆనంద్‌ శర్మే అని ఆరోపించినట్టు కూడా తెలిసింది.

నేతలంతా చివరికి లేఖ రాసిన వ్యక్తుల్ని కాకుండా సందర్భాన్ని తప్పుపడుతూ గాంధీ కుటుంబానికి విధేయత ప్రకటించారు. అలాగే రాహుల్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని కూడా కోరారు. మరోవైపు సమావేశం వెలుపల, వివిధ ప్రాంతాల్లో రాహులే అధ్యక్షుడు కావాలంటూ పార్టీ శ్రేణులు డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో చివరకు ఏఐసీసీ సెషన్‌లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరిగేవరకు సోనియానే  చీఫ్‌గా కొనసాగాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది.

ధిక్కార స్వరం వినిపించిన వారు కూడా ఈ తీర్మానంలో భాగం కావటంతో తాత్కాలికంగా పరిస్థితి సద్దుమణిగిందనే చెప్పాలి. సమావేశం చివరలో సోనియా  ‘మనది పెద్ద కుటుంబం.  భిన్న అభిప్రాయాలు ఉంటాయి. కానీ ప్రజల కోసం  కలిసి పోరాడాలి. సంస్థాగత అంశాలు ఎప్పుడైనా పరిష్కరించుకోవచ్చు..’అని ప్రకటించినట్టు కేసీ వేణుగోపాల్‌ చెప్పారు.  కాగా, సీడబ్ల్యూసీ భేటీ తర్వాత లేఖ రాసిన సీనియర్లు కొందరు గులాంనబీ ఆజాద్‌ నివాసంలో భేటీ అయ్యారు. కపిల్‌ సిబల్, శశిథరూర్, ముకుల్‌ వాస్నిక్, మనీష్‌ తివారీలు హాజరైన వారిలో ఉన్నారు.


బలహీనపరచడాన్ని అనుమతించలేం: సీడబ్ల్యూసీ
ఏఐసీసీ సమావేశం నిర్వహణకు పరిస్థితులు అనుకూలించేదాకా  కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొనసాగాలని సోనియా గాంధీని కోరుతూ సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానించింది. పార్టీ ముందున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సంస్థాగతంగా మార్పులు చేపట్టడానికి సోనియాకు అధికారాన్ని కట్టబెట్టింది. సోనియా, రాహుల్‌ల నాయకత్వాన్ని  బలోపేతం చేయాలని నిర్ణయించింది. పార్టీని, నాయకత్వాన్ని బలహీనపర్చేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేసింది. పార్టీ అంతర్గత వ్యవహారాలను మీడియాలో, బాçహాటంగా చర్చించకూడదని, వాటిని పార్టీ వేదికలపైనే లేవనెత్తాలని కోరింది.

సుమారు 7 గంటల పాటు జరిగిన సీడబ్ల్యూసీ భేటీ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మీడియాకు వెల్లడించారు.  ‘కాంగ్రెస్‌ అధ్యక్షురాలికి రాసిన లేఖపై సీడబ్ల్యూసీ లోతుగా చర్చించి ఈ తీర్మానాలు చేసింది. వేలాది మంది ప్రాణాలను తీసిన కరోనా మహమ్మారి, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, పేదరికం, చైనాతో ఉద్రిక్తతలు వంటి సవాళ్లను  దేశం ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ప్రభుత్వం విభజన రాజకీయాలు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపడానికి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ తమ స్వరం వినిపించారు.  ఈ దిశగా సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ప్రయత్నాలను పార్టీ మరింత బలోపేతం చేయాలి’ అని తీర్మానంలో సీడబ్ల్యూసీ పేర్కొంది.   

గులాం నబీ ఆజాద్‌ రాజీనామాపై ట్వీట్‌
మీటింగ్‌ ఒకవైపు సాగుతుండగానే ఆజాద్‌ ఒక ట్వీట్‌ చేశారు. ‘మీడియాలోని ఒక వర్గం తప్పుగా అన్వయించింది. మేం ఆ లేఖ బీజేపీతో కుమ్మక్కై రాసినట్టు నిరూపించాలని రాహుల్‌ను ఉద్దేశించి నేను అన్నట్టుగా తప్పుగా అన్వయించింది. నేను భేటీలో ఏమన్నానంటే.. నిన్న కొందరు కాంగ్రెస్‌ వ్యక్తులు మేం బీజేపీతో కుమ్మక్కయి లేఖ రాశామని అన్నారు. అది చాలా దురదృష్టకర సంఘటన. ఈ ఆరోపణను నిజమని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నాను’ అని ట్వీట్‌ చేశారు.

సోనియానే కొనసాగాలి
పార్టీ ప్రెసిడెంట్‌గా సోనియా గాంధీనే కొనసాగాలని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ గట్టిగా కోరారు. సీడబ్ల్యూసీ భేటీలో కేసీ వేణుగోపాల్, సోనియాగాంధీల అనంతరం మన్మోహన్‌ ప్రసంగించారు. నూతన అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ప్రారంభమయ్యే పూర్తిస్థాయి ఏఐసీసీ సమావేశాలు జరిగేవరకు అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగాలని ఆయన సోనియాను కోరారు. నాయకత్వ మార్పు కోరుతూ సీనియర్లు లేఖ రాయడాన్ని ఆయన తప్పుబట్టారు. అది దురదృష్టకరమన్నారు. ‘హైకమాండ్‌ బలహీనమయితే, కాంగ్రెస్‌ పార్టీ బలహీనమవుతుంది’అని వ్యాఖ్యానించారు. మరోవైపు, సోనియా గాంధీ కొనసాగనట్లయితే.. అధ్యక్ష బాధ్యతలను రాహుల్‌ గాంధీ స్వీకరించాలని మరో సీనియర్‌ నేత ఏకే ఆంటోనీ కోరారు. సీనియర్లు రాసిన లేఖ కన్నా.. ఆ లేఖలోని అంశాలు క్రూరంగా ఉన్నాయని ఆంటోనీ విమర్శించారు.

అందుకే ఆ ట్వీట్‌ను తొలగించా!: సిబల్‌  
రాహుల్‌ గాంధీని ఘాటుగా విమర్శిస్తూ చేసిన ట్వీట్‌ను ఆ తరువాత సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ తొలగించారు. బీజేపీతో కుమ్మక్కు అయ్యారన్న వ్యాఖ్య తాను చేయలేదని రాహుల్‌ గాంధీ స్వయంగా తనతో చెప్పారని, అందువల్ల ఆ ట్వీట్‌ను తొలగిస్తున్నానని సిబల్‌ వివరణ ఇచ్చారు. ‘బీజేపీతో కుమ్మక్కయ్యామని రాహుల్‌ అంటున్నారు. రాజస్తాన్‌ హైకోర్టులో కాంగ్రెస్‌ తరఫున జరిపిన పోరాటంలో విజయం సాధించాం. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే విషయంలో పార్టీ తరఫున విజయవంతంగా పోరాడాం. 30 ఏళ్లలో ఏ అంశంపైన కూడా బీజేపీకి మద్దతిస్తూ ఒక వ్యాఖ్య కూడా చేయలేదు. అయినా, బీజేపీతో కుమ్మక్కయ్యామని అంటున్నారు’అని తొలగించిన ఆ ట్వీట్‌లో సిబల్‌ పేర్కొన్నారు.  పూర్తి సమయం పని చేసే నాయకత్వం ప్రస్తుతం పార్టీకి అవసరమని పేర్కొంటూ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్‌ నేతల్లో సిబల్‌ కూడా ఒకరు.

నెహ్రూ– గాంధీ కుటుంబం నుంచి ఐదుగురు
► ఇతరులు 13 మంది
► స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్షులు

కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సోనియాగాంధీ సిద్ధమయ్యారు. రాహుల్‌  మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి విముఖంగా ఉన్నారని సమాచారం. ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పదోన్నతికి ప్రియాంకా గాంధీ సిద్ధంగా లేరని అంటున్నారు. గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు వస్తారా? కాలమే తేల్చాలి. ఇప్పటికైతే సోనియాను కొనసాగాల్సిందిగా  సీడబ్ల్యూసీ తీర్మానించింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే... ఇప్పటిదాకా కాంగ్రెస్‌కు  18 మంది అధ్యక్షులుగా పనిచేశారు. వీరిలో నెహ్రూ– గాంధీ కుటుంబానికి చెందిన ఐదుగురే దాదాపు 40 ఏళ్లు పార్టీ పగ్గాలు చేపట్టారు.

ఈ కుటుంబం నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, సోనియా, రాహుల్‌లు అధ్యక్షులుగా పనిచేశారు. అందరికంటే అత్యధికకాలం పార్టీని నడిపింది సోనియా గాంధీనే. ఇప్పటిదాకా ఆమె 20 ఏళ్లు కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ కుటుంబం నుంచి కాకుండా ఇతరులు 13 మంది కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. వారు... జేబీ కృపలానీ, పట్టాభి సీతారామయ్య, పురుషోత్తందాస్‌ టాండన్, యు.ఎన్‌.ధేబర్, నీలం సంజీవరెడ్డి, కె.కామరాజ్, ఎస్‌.నిజలింగప్ప, జగ్జీవన్‌ రామ్, శంకర్‌దయాళ్‌ శర్మ, డి.కె.బరూహ్, కాసు బ్రహ్మానంద రెడ్డి, పి.వి.నరసింహారావు, సీతారాం కేసరి. 

మరిన్ని వార్తలు