వివాదాల ఆజాం ఖాన్‌.. రెండేళ్ల తర్వాత జైలు నుంచి విడుదల

20 May, 2022 15:49 IST|Sakshi

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, రాంపూర్‌ ఎమ్మెల్యే ఆజాం ఖాన్‌(73) ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. వివిధ కేసుల నేపథ్యంలో ఆయన 27 నెలలపాటు జైలులోనే గడిపారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయనకు విడుదల లభించింది. 

గురువారం సుప్రీం కోర్టు.. ఆజాం ఖాన్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఈ ఉదయం యూపీలోని సీతాపూర్‌ జైలు నుంచి ఆయన రిలీజ్‌ అయ్యారు. బయటకు వచ్చిన ఆవెంటనే ఆయన తనయుడు.. ఎమ్మెల్యే అబ్దుల్లా ఆజాంతో పాటు ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ(లోహియా) నేత శివ్‌పాల్‌ సింగ్‌ యాదవ్‌, భారీ ఎత్తున మద్దతుదారులు ఆజాంఖాన్‌కు స్వాగతం పలికారు. 

జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన.. స్వస్థలం రాంపూర్‌కు వెళ్లిపోయారు. గురువారమే ఆయనకు బెయిల్‌ వచ్చినప్పటికీ.. స్థానిక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఆ ఆదేశాలను అందుకోవడం, వాటిని సీతాపూర్‌ జైలు సూపరిండెంట్‌కు పంపడంతో అర్ధరాత్రి అయ్యింది. ఈ క్రమంలో ఈ ఉదయం ఆయన్ని రిలీజ్‌ చేశారు. 

ఇదిలా ఉంటే.. ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లో సీనియర్‌ నేతగా పేరున్న ఆజాం ఖాన్‌.. వివాదాస్పద వ్యాఖ్యలు, వైఖరితో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు కూడా. భూ కబ్జాతో పాటు చాలా కేసులు ఆయనపై నమోదు అయ్యాయి. ఒకానొక తరుణంలో ఆయన జైలు శిక్షపై న్యాయస్థానాల్లోనూ ఆసక్తికరమైన చర్చ కూడా నడిచింది. మరోవైపు రాజకీయ వైరంతోనే జైలుకు పంపారంటూ ఆజాం ఖాన్‌ అనుచరులు ఆరోపిస్తున్నారు. మొన్న యూపీ ఎన్నికల్లో జైలు నుంచే ఆయన ఘన విజయం సాధించడం విశేషం.

చదవండి: రాబోయే 25 ఏళ్లు బీజేపీవే.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!

మరిన్ని వార్తలు