Bharat Rashtra Samithi-KCR: ‘బీఆర్‌ఎస్‌’ వాట్‌ నెక్ట్స్‌?.. సీఎం కేసీఆర్‌ ప్లాన్‌ ఏంటి?

17 Dec, 2022 21:09 IST|Sakshi

తెలుగు నేల నుంచి ఓ పార్టీ జాతీయ స్థాయికి వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అంతకుముందే తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారు. దీనికి ఎన్నికల సంఘం కూడా క్లియరెన్స్ ఇచ్చింది. దేశ రాజధానిలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ కొత్త కమిటీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. 

సార్‌.. కార్‌.. నజర్‌
దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో భారతీయ రాష్ట్ర సమితి పతాకాన్ని ఆవిష్కరించి.. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ప్రాధాన్యతను వివరించే దిశగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. కేవలం రాజకీయ ప్రకటనలకు పరిమితం కాకుండా.. ఈ విషయంలో విభిన్నంగా ముందుకు సాగాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు.

తన ఆలోచనలకు తగినట్లుగానే జాతీయ పార్టీలతో, సంస్థలతో గతంలో పనిచేసిన వ్యక్తులతో  కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న చిన్నాచితక పార్టీల నాయకులతో కూడా కేసీఆర్ ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ముందుగా జాతీయ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.

కార్‌ టీంలో ఎవరెవరు?
బీఆర్ఎస్ పొలిట్ బ్యూరో ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ ఇప్పటికే కొంత కసరత్తు చేశారు. ప్రాథమికంగా 15 నుంచి 25 మందితో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిసింది. పార్టీ సీనియర్ నేత కేశవరావుకు ఈ కమిటీలో అవకాశం కల్పించనున్నారు. లోక్‌సభ ఎంపీల్లో ఒకరిద్దరికి, రాజ్యసభ సభ్యుల్లో ఒకరికి ఈ కమిటీలో అవకాశం ఉంటుందని తెలిసింది. అదే సమయంలో కొందరు కొత్తవారికి, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నవారికి కూడా ఈ కమిటీలో స్థానం కల్పించనున్నారు.

ప్రస్తుతం సైలెంట్‌..
జాతీయ స్థాయిలో పొత్తుల అంశానికి సంబంధించి ప్రస్తుతం సైలెంట్‌గా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. తొందరపడి ఏ పార్టీతోనూ పొత్తులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరపకూడదనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు. కేసీఆర్‌తో పూర్తిస్థాయిలో కలిసి పని చేయడానికి జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఇప్పటికే ముందుకు వచ్చారు. వచ్చే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని జేడీఎస్, బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే కర్ణాటకలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో బీఆర్ఎస్ పోటీ చేయనుంది.

మరోవైపు దేశంలో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటనలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే రాష్ట్రాలపైనే కేసీఆర్ ప్రస్తుతం దృష్టి సారిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏడాది కాలంలోనే వస్తున్నందున  మొదటి ప్రాధాన్యత తెలంగాణ రాజకీయాలకే ఉంటుందని దశలవారీగా జాతీయస్థాయిలో పర్యటించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

పొలిటికల్‌ ఎడిటర్, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

మరిన్ని వార్తలు