సీఎం మమతా బెనర్జీకి శ్రీలంక అధ్యక్షుడి కీలక ప్రశ్న.. దీదీ ఏమని చెప్పారంటే..?

13 Sep, 2023 16:46 IST|Sakshi

దుబాయ్, స్పెయిన్ పర్యటనలో సీఎం మమతా బెనర్జీ

దుబాయ్ ఎయిర్‌పోర్టులో శ్రీలంక అధ్యక్షుడితో ముచ్చటించిన దీదీ

ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తారా..? అని ప్రశ్నించిన రణిల్ విక్రమసింగే

ప్రజల మద్దతుతో అధికారంలోకి వస్తామని చెప్పిన మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింగే ఆసక్తికర ప్రశ్న అడిగారు. ప్రస్తుతం దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒక్కటైన ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తారా..? అని రణిల్ విక్రమసింగే దీదీని అడిగారు. అందుకు ఆమె.. చిరునవ్వుతూ ప్రజల మద్దతు ఉంటే అధికారంలోకి వస్తాం అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం మమతా బెనర్జీ దుబాయ్, స్పెయిన్ పర్యటనలో ఉన్నారు. 

దుబాయ్ పర్యటనలో భాగంగా ఎయిర్‌పోర్టులో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింగే, సీఎం మమతా బెనర్జీని కలిశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. నవంబర్‌లో కలకత్తాలో జరగనున్న బిజినెస్ సమ్మిట్‌కు ఆయన్ని మమతా బెనర్జీ ఆహ్వానించారు. శ్రీలంకలో పర్యటించాలని సీఎం మమతను రణిల్ విక్రమసింగే ఆహ్వానించారు. 

ఇండియా కూటమి సమన్వయ కమిటీ నేడు ఢిల్లీలో భేటీ కానుంది. కమిటీలో నేతలు ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో చర్చలు జరపనున్నారు. లోక్‌సభ సీట్ల షేరింగ్, పార్టీల మధ్య విభేదాలు, ప్రచారాలు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ మీటింగ్‌కి టీఎంసీ దూరంగా ఉంది. తమ రాష్ట్రంలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు సీట్లను పంచుకునే ప్రసక్తే లేదని ఇప్పటికే మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కూటమిపై శ్రీలంక అధ్యక్షుడు అడిగిన ప్రశ్న ప్రాధాన్యత సంతరించుకుంది.  

ఇదీ చదవండి: ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు..

మరిన్ని వార్తలు