కఠిన చర్యలు తీసుకోవాలి

15 May, 2021 04:05 IST|Sakshi

నరసాపురం పార్లమెంట్‌ పరిధిలో నమోదైన కేసుల్లోనూ విచారించాలి

ఇది సీఐడీ నమోదు చేసిన కేసులో భాగంగా జరిగిన అరెస్ట్‌

గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు

పెనుగొండ: నరసాపురం పార్లమెంట్‌ సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. శుక్రవారం ఎంపీ అరెస్ట్‌పై పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో మంత్రి స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్‌ చేసిన కేసులోనే కాకుండా, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో నమోదైన కేసుల్లోనూ పోలీసులు విచారణ చేయాలన్నారు. స్థానికంగా ఎంపీపై పలు కేసులు నమోదు అయ్యాయని గుర్తు చేశారు. గెలిపించిన పార్లమెంటు ప్రజలను 13 నెలలుగా వదిలేసి.. ఢిల్లీ, హైదరాబాద్‌లలో తిరుగుతున్నారన్నారు. కరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూంటే, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా ఎంపీ వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీగా గెలిచి సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ పార్టీ పరువు తీసేలా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. 

మంత్రి ఇంకా ఏమన్నారంటే..
► వ్యక్తిగతంగా మా మీద ఎన్ని నిందలు మోపినా, ఎంత దిగజారి అసత్యాలు ప్రచారం చేసినా మేం సహించాం, భరించాం. 
► ఈ రోజు రఘురామకృష్ణరాజు అరెస్టుకు.. మా పార్టీకి, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది సీఐడీ పోలీసులు ప్రాథమిక విచారణ చేసి నమోదు చేసిన ఒక కేసులో జరిగిన అరెస్ట్‌.
► సీఐడీ ఏం చెప్పిందో వారి స్టేట్‌మెంట్‌లోనే ఉంది. ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసేలా ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ఆయన చేస్తున్న ప్రసంగాలు.. ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై ద్వేషాన్ని పెంచేందుకు ఆయన ప్రయత్నించారని తమకు వచ్చిన సమాచారం మీద విచారణ జరిపి కేసు నమోదు చేశామని, ఆ కేసు ప్రకారమే ఆయన్ను అరెస్టు చేశామని సీఐడీ స్పష్టం చేసింది. 
► రాజద్రోహానికి పాల్పడిన వారిని అరెస్ట్‌ చేయగానే చంద్రబాబునాయుడు, టీవీ5, ఏబీఎన్‌ ఎంత ప్రేమ ఒలకబోశారో అందరూ చూశారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు