కొత్తనాటకానికి తెరతీసిన బీజేపీ, జనసేన

24 Nov, 2020 08:22 IST|Sakshi
సోమువీర్రాజుతో వినుత

జనసేన నాయకురాలు వినుతపై దాడి చేసింది ఆ పార్టీ కార్యకర్తే 

వైఎస్సార్‌సీపీకి అంటగట్టే ప్రయత్నం 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి చేతే అబద్దాలు  

ముక్కున వేలేసుకుంటున్న జనం 

బీజేపీ, జనసేన పార్టీ కొత్తనాటకానికి తెరతీశాయి. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ అసత్యప్రచారాలకు దిగుతున్నాయి. అంతటితో ఊరుకోక అధికార పార్టీ ఎమ్మెల్యేలనే దోషులుగా చూపేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి. దీనికి శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్‌ వినుత అండ్‌ కో ఆడుతున్న నాటకం జిల్లాలో చర్చనీయాంశమైంది.  

సాక్షి, తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని రాజకీయ ప్రయోజనం కోసం బీజేపీ, జనసేన కలిసి నాటకాన్ని రక్తికట్టిస్తున్నాయి. గతంలో టీడీపీ ‘పచ్చ’ అబద్దాలను బూతద్దంలో చూపించేందుకు ప్రయత్నించగా ఇప్పుడు అదే కోవలో ఆ రెండు పార్టీలు చేరిపోయాయి.  

అసలేం జరిగిందంటే 
శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్‌ నగరం వినుత, జనసైనికుడు మర్రిగుంట శివకుమార్‌పై కేసులున్నాయి. జనసేనలోకి వస్తే ఎలమండ్యం ఎంపీటీసీ సభ్యుడు నువ్వేనని శివకు ఆశపెట్టారు. నాటి నుంచి శివకుమార్‌ వినుత చెప్పిన కార్యక్రమాలన్నీ చేసేవాడు. ఆమె ఆదేశాల మేరకు లాక్‌డౌన్‌ సమయంలోనూ సొంత డబ్బులు పెట్టి కాలనీలో నిత్యావసరాలు పంపిణీ చేశాడు. ఆ తర్వాత ఎంపీటీసీ అభ్యర్థిగా ప్రకటించకపోవడం, కేసు విషయంలో సాయం చేయకపోవడంతో శివకుమార్‌ శనివారం వినుత భర్తను కలిశాడు. తనకు ఏమీ చేయలేదని, కనీసం కేసు నుంచైనా తప్పించేందుకు పోలీసులతో మాట్లాడమని ప్రాధేయపడ్డారు. ఆర్థికంగా చితికిపోయానని, ఏదైనా సాయం చేయమని ఆమెను ప్రాధేయపడినట్టు తెలిసింది. ఆ సందర్భంలో వారి మధ్య మాటామాట పెరిగింది. ఈ సందర్భంగా శివను వినూత భర్త కులం పేరుతో దూషించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నే ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆపై ఆగ్రహించిన శివకుమార్‌ వినుత కారు అద్దాలు పగులగొట్టి పోలీసులకు లొంగిపోయాడు. జనసేన నాయకులు శివకుమార్‌ వైఎస్సార్‌సీపీ కార్యకర్త అని ప్రచారం చేసుకోవడం గమనార్హం.   (కార్యకర్తను కులం పేరుతో దూషించిన జనసేన నేత)

ఆ ఇద్దరూ ఒకప్పుడు వైఎస్సార్‌ సీపీలోనే 
ప్రస్తుత జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నగరం వినుత, శివ ఇద్దరూ గతంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలుగా ఉన్నారు. వినుత తండ్రి నగరం భాస్కర్‌  వైఎస్సార్‌సీపీ రేణిగుంట పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. వినుత తల్లి జయలలిత రేణిగుంట ఎంపీటీసీ సభ్యురాలు. గతంలో టీడీపీ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ చేపట్టిన ఆందోళనలో తల్లిదండ్రులుతో పాటు వినుత, శివకుమార్‌ పాల్గొనేవారు. ఆ తర్వాత పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టడంతో వినుత, శివకుమార్‌ మరికొందరు జనసేనలో చేరిపోయారు. నాటి ఫొటోలను పెట్టుకుని నగరం వినుత అండ్‌ కో శివ వైఎస్సార్‌ సీపీ కార్యకర్తే అని దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. తన గొడవకు వైఎస్సార్‌సీపీ ఎటువంటి సంబంధం లేదని శివ పదేపదే చెప్పినా.. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై జనసేన అండ్‌ కో అసత్య ఆరోపణలకు దిగారు. తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ చిల్లర గొడవను బూతద్దంలో చూపించేందుకు జనసేనతో బీజేపీ జత కట్టింది.  

గతమంతా అబద్ధాలే 
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయంలో నగరం వినుత వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను వైఎస్సార్‌సీపీ నాయకులు కిడ్నాప్‌ చేశారని వినుత డ్రామా ఆడారు. అయితే ఆ జెడ్పీటీసీ, ఎంపీటీసీ కుటుంబ సభ్యులే వినుతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరం వినుత వచ్చి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను తీసుకెళ్లినట్లు పోలీసుల ఎదుట చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు వినుత డ్రామాను బయటపెట్టారు. మర్రిగుంట ఏరియాలో వినుత అద్దెకు తీసుకుని ఉన్న భవనంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ఉంచినట్లు గుర్తించారు. పోలీసుల విచారణతో వినుత కిడ్నాప్‌ డ్రామా సుఖాంతమైంది. అలాగే 15 ఏళ్లలోపు వయస్సు ఉన్న పిల్లలను వినుత, ఆమె భర్త రాజకీయ ప్రచారాలకు తిప్పుకునేవారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. స్థానిక బీజేపీ, జనసేన నాయకులు చెప్పిన అబద్ధాలను నమ్మి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు