వారి కుట్రలకు ఆగం కావద్దు

23 Sep, 2021 01:31 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌గౌడ్‌. చిత్రంలో గంగుల, హరీశ్‌రావు తదితరులు

ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌  

బీసీలకు జాతీయ పార్టీలు ఎప్పుడూ న్యాయం చేయలేదు 

గత ప్రభుత్వాల పాలనలో గౌడన్నల పరిస్థితి దయనీయం 

కేసీఆర్‌ వచ్చాకే పరిస్థితి మారి గౌరవం పెరిగింది 

హుజూరాబాద్‌: జాతీయ పార్టీలు బీసీలకు ఏనాడూ న్యాయం చేయలేదని, ఆ పార్టీల కుట్రలకు ఆగం కావొద్దని రాష్ట్ర ఎౖక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. హుజూరాబాద్‌లోని మార్కెట్‌ యార్డులో బుధవారం రాష్ట్రమంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన టీఆర్‌ఎస్‌కు మద్దతుగా గౌడ కులస్తుల ఆశీర్వాద సభ ని ర్వహించారు. రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌ పాల్గొన్నారు. ఈ సభలో, స్థానికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడారు. గౌడన్నలు సర్దార్‌ సర్వాయి పాపన్న, ఎల్లమ్మ తల్లి వారసులని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో వీరి పరిస్థితి దయనీయంగా ఉండేదన్నారు. గత పాలకుల వైఖరి వల్ల గౌడ కులస్తులు తీవ్రమైన అన్యాయానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ సీఎం అయిన తర్వాతే వీరి ఆత్మ గౌరవం పెరిగిందని చెప్పారు. వృత్తి, చెట్టు పన్ను మాఫీచేశారని, కల్లు గీత వృత్తి గౌడ లకే పరిమితమని, నీరా అమ్మకాలు గౌడేతరులు విక్రయిస్తే జైలుకు పంపే జీవోలు తెచ్చారని తెలిపారు. వృత్తిలో ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికుల కుటుంబానికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారన్నారు.  

వైన్‌ షాపుల్లో రిజర్వేషన్లు ఎక్కడా లేవు 
తాజాగా వైన్‌ షాపుల్లో 15 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని, వైన్‌ షాపుల్లో రిజర్వేషన్లు కల్పించడం దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా లేదని మంత్రి తెలిపారు. గీత కార్మికులకు మోపెడ్‌ వాహనాలు ఇవ్వాలని సహచర మంత్రి హరీశ్‌రావుతో కలిసి సీఎంను కోరతానని హామీ ఇచ్చారు. గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

ఇక్కడి మట్టి బిడ్డను నేను: గెల్లు శ్రీనివాస్‌ 
‘ఇక్కడి మట్టి బిడ్డను నేను. ఇక్కడి చెమట చుక్కను నేను. నన్ను ఆశీర్వదిస్తే హుజూరాబాద్‌ ప్రజలకు సేవ చేస్తా. ఈ నియోజకవర్గంలో నిరుపేదలు చాలామంది ఉన్నారు, అందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా..’అని హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే హుజూరాబాద్‌కు మెడికల్‌ కాలేజీ వస్తుందని భరోసా ఇచ్చారు. సభలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, గంగాధర్‌ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, ఎమ్మెల్యేలు సతీష్‌కుమార్, ప్రకాష్‌ గౌడ్, దివాకర్‌ గౌడ్, మాజీ పార్లమెంట్‌ సభ్యులు బూర నర్సయ్య గౌడ్, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు