వైఎస్సార్‌ చేయూతను విమర్శిస్తే మహిళలు బుద్ధి చెబుతారు

13 Aug, 2020 14:15 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ‘వైఎస్సార్‌ చేయూత’ పధకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో మహిళలు తమ కష్టాలను సీఎం జగన్‌కు చెప్పుకున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా మహిళలను ఆదుకుంటామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. మహిళలను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల మహిళకు ‘వైస్సార్ చేయూత’ ద్వారా మేలు జరుగుతుందని తెలిపారు. 23లక్షల మంది మహిళలు ఈ పధకం ద్వారా లబ్ధి పొందుతారని తెలిపారు.

ఓట్లు కొనడం కోసం ఎన్నికలు ముందు ‘పసుపు కుంకుమ’ పథకాన్ని చంద్రబాబు ప్రవేశ పెట్టారని మండిపడ్డారు. కానీ, ఆ పథకాన్ని ప్రవేశ పెట్టిన బాబుకు 23 స్థానాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. సంక్షోభంలో సంక్షేమం కార్యక్రమాలు అమలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్‌ అని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను అడ్డం పెట్టుకొని బాబు తన కొడుకు క్షేమం కోసం పాటుపడ్డాడని దుయ్యబట్టారు. ఇష్టానుసారంగా రాసే మీడియా బాబు చేతిలో ఉండడంతో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ చేయూతపై విమర్శలు చేస్తే బాబుకు మళ్లీ మహిళలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు మహిళను మోసం చేశారని విమర్శించారు. మహిళల ఇంటికి బంగారం పంపిస్తామని చెప్పి బాబు బ్యాంక్‌ల నుంచి నోటీసులు పంపించారని విరుచుకుపడ్డారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ మహిళలు జగనన్న తమకు తోడుగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. బీసీలను అనేక రకాలుగా చంద్రబాబు మోసం చేశారని మండిప​డ్డారు. ప్రభుత్వంపై బురద జల్లాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేసే మంచిని అడ్డుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. పురాణాల్లో రాక్షషులు యజ్ఞాన్ని అడ్డుకున్నట్లు సీఎం జగన్‌ చేస్తున్న సంక్షేమ యజ్ఞాన్ని టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని అన్నారు. బీసీ సంక్షేమంపై టీడీపీ నేతలతో చర్చకు తాము సిద్ధమని తెలిపారు. బీసీల వెన్ను చంద్రబాబు నాయుడు విరిచారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు