156 స్థానాల్లో డీఎంకే కూటమి ఘనవిజయం

3 May, 2021 04:01 IST|Sakshi

డీఎంకే ఘన విజయం  

అధికార అన్నాడీఎంకేకు తప్పని పరాజయం

నాలుగు సీట్లు గెల్చుకున్న బీజేపీ

చెన్నై: తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి ఘన విజయం సాధించింది. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొని మళ్లీ అధికారంలోకి రావాలనుకున్న అన్నాడీఎంకే ఆశలు నెరవేరలేదు. మొత్తం 234 స్థానాలకు గానూ డీఎంకే కూటమి 118 సీట్ల మెజారిటీ మార్క్‌ను సునాయాసంగా దాటేసి, 156 సీట్లను(ఆధిక్యంతో కలుపుకుని) గెల్చుకుంది. అన్నాడీఎంకే కూటమికి 78 సీట్లు(ఆధిక్యంతో కలుపుకుని) లభించాయి. పార్టీల వారీగా డీఎంకే 131, కాంగ్రెస్‌ 17, సీపీఎం 2, సీపీఐ 2, వీసీకే 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఎన్డీయే నుంచి అన్నాడీఎంకే 70, పీఎంకే 4, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. డీఎంకే కూటమి 46.21% ఓట్లు సాధించగా, అన్నాడీఎంకే కూటమి 40.14% ఓట్లు సాధించింది.   చదవండి: (మరో వారసుడు రెడీ)

జయ, కరుణానిధి లేకుండా..
డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల దిగ్గజ నాయకులు, దశాబ్దాలుగా తమిళ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన కరుణానిధి, జయలలిత లేకుండానే ఈ ఎన్నికలు జరిగాయి. కరుణానిధి 2018లో, జయలలిత 2016లో మరణించిన విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ పార్టీ ‘మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం)’ కనీసం ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది. స్వయంగా కమల్‌హాసన్‌ కోయంబత్తూర్‌ సౌత్‌ స్థానంలో ఓటమి పాలయ్యారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్‌ స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ముఖ్యమంత్రి పళనిసామి సేలం జిల్లాలోని ఎడప్పాడి నుంచి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం బోదినాయకనూర్‌ నుంచి, డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ కోలత్తూర్‌ స్థానం నుంచి విజయం సాధించారు. స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ చెపాక్‌– ట్రిప్లికేన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. డీఎంకే ఘనవిజయంతో పార్టీ శ్రేణులు, కోవిడ్‌ నిబంధనలను పట్టించుకోకుండా, సంబరాల్లో  మునిగితేలాయి.‘స్టాలిన్‌ థాన్‌ వారారు(స్టాలిన్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారు)’ అనే డీఎంకే ప్రచార గీతం హోరెత్తింది. డీఎంకే విజయం సాధించిన 2006లో డీఎంకే 96, డీఎంకే మిత్ర పక్షం కాంగ్రెస్‌ 34, అన్నాడీఎంకే 61 సీట్లు గెలుచుకున్నాయి. 2011, 2016 ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘన విజయం సాధించింది.   చదవండి:  (కమల్, దినకరన్, సీమాన్, కుష్బుకు తప్పని ఓటమి)

డీఎంకేతోనే సంక్షేమం..
తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్‌ 6న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. గత దశాబ్ద కాలంగా డీఎంకే అధికారంలో లేదు. ఈ ఎన్నికల్లో ఘన విజయం అందించిన తమిళనాడు ప్రజలకు డీఎంకే చీఫ్, కాబోయే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో డీఎంకే ఆరోసారి అధికారంలోకి రానుందన్నారు. డీఎంకే పాలనలోనే సంక్షేమం సాధ్యమని ప్రజలు విశ్వసించారని వ్యాఖ్యానించారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రతీక్షణం పాటుపడుతానన్నారు. గతంలో డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో స్టాలిన్‌ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మరోవైపు, తమిళనాడులో ఘనవిజయం సాధించిన డీఎంకేకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. అలాగే, ఎన్డీయేకు ఓటేసిన తమిళ ప్రజలకు, కూటమి విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు