గ్రేటర్‌ ఎన్నికలు: స్టార్‌ క్యాంపెయినర్లు రంగంలోకి..

24 Nov, 2020 08:17 IST|Sakshi

ఎన్నికల ప్రచారంలో హేమాహేమీలు 

కమ్యూనిటీల వారీగా ప్రత్యేక భేటీలు 

టీఆర్‌ఎస్‌కు వెన్నుదన్నుగా కేటీఆర్‌  

 బీజేపీలో కిషన్‌రెడ్డి, సంజయ్‌ తదితరులు 

కాంగ్రెస్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి 

ఎంఐఎం ప్రచారంలో ఎంపీ అసదుద్దీన్‌ 

పోటాపోటీ ప్రసంగాలతో రాజకీయ వేడి 

జెండాలు, కర్రపత్రాలు, కండువాల జోరు  

పార్టీల గుర్తుగా వినియోగిస్తున్న మాస్కులు  

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార, ప్రధాన ప్రతిపక్ష పాలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటన, నామినేషన్ల ఘట్టం ఇప్పటికే ముగిసింది. ఎన్నికల గడువు కూడా దగ్గరపడుతోంది. ప్రచారానికి పెద్దగా సమయం కూడా లేదు. దీంతో  అధికార టీఆర్‌ఎస్‌ సహా బీజేపీ, కాంగ్రెస్‌ ఇతర పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్టార్‌ క్యాంపెయిర్లను రంగంలోకి దింపి హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. రోడ్‌షోలు, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఒకవైపు ప్రత్యక్షంగా డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ నిర్వహిస్తూనే స్మార్ట్‌ఫోన్‌లు వాడే యువత, ఉద్యోగులు, వ్యాపారులను ఆకర్షించేందుకు సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పోటాపోటీగా ప్రెస్‌మీట్లు ఏర్పాటు చేస్తూ నేతలు ఇచ్చే హామీలు, మాటల తూటాలను పోస్టులు చేస్తున్నారు. 

టీఆర్‌ఎస్‌లో కేటీఆర్‌ ప్రచారం ముమ్మరం 
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే డివిజన్ల వారీగా రోడ్‌ షోలు నిర్వహిస్తోంది. మంత్రి కేటీఆర్‌ ప్రచారంలో ప్రధాన స్టార్‌గా దూసుకుపోతున్నారు. మూడు రోజుల నుంచి రోజుకు కనీసం పది పదిహేను డివిజన్లకు తగ్గకుండా రోడ్‌షోలతో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు ఒక్కో డివిజన్‌కు మంత్రులు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు.  

కాంగ్రెస్‌ ఇలా.. 
గ్రేటర్‌లో పట్టు నిలుపుకొనేందుకు కాంగ్రెస్‌ శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. అభ్యర్థుల గెలుపు కోసం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి సహా పలువురు నేతలు రంగంలోకి దిగారు. అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్, బీజేపీలను ఎండగడుతున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగించడం, కార్యకర్తలు చేజారకుండా కాపాడుకోవడం వీరికి తలకుమించిన భారంగా మారింది.

ఎంఐఎం అలా.. 
ఇక ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆ పార్టీ అభ్యర్థుల తరపున పాతబస్తీలో ప్రచారం చేస్తున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా డోర్‌ టు డోర్‌ వెళ్లి ఓటర్లను పలకరిస్తున్నారు.   

ఆ మాస్కులకు డిమాండ్‌  
కరోనా నేపథ్యంలో అభ్యర్థులు తమ పార్టీ గుర్తులతో ఉన్న మాస్క్‌లను తయారు చేయిస్తున్నారు. మాస్క్‌లపై పార్టీ గుర్తు, అభ్యర్థి ఫొటో  ఉండేలా చూసుకుంటున్నారు. ఈ తరహా ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వీటితో పాటు టోపీలు, కండువాలు, బ్యానర్లు, ప్లకార్డులు, తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్‌ జెండాలపై అభ్యర్థి ఫొటో, పార్టీ గుర్తు ఉండేలా చూస్తున్నారు.    

జాతీయ, రాష్ట్రస్థాయి నేతలతో బీజేపీ.. 
అధికార పార్టీ దూకుడుకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రతిపక్ష బీజేపీ కూడా ప్రచారం నిర్వహిస్తోంది. జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. నగరంలోని ఉత్తరాది రాష్ట్రాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా రాష్ట్రాల నుంచి ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్, ఐటీ విభాగం కార్యకర్తలను నగరానికి రప్పించింది. డివిజన్‌కు కనీసం పది మంది సభ్యులకు తగ్గకుండా ప్రచారం నిర్వహిస్తోంది.  

ఎన్నికల ఇన్‌చార్జి భూపేందర్‌ యాదవ్‌ సహా బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ సహా పలువురు నేతలు పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూనే మరో వైపు సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి చర్యలు  తీసుకుంటున్నారు.   

మైకుల మోత 
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో మైకుల మోత మోగుతోంది. సోమవారం నుంచి ఇది పతాక స్థాయికి చేరింది. వివిధ పారీ్టల బ్యానర్లు, జెండాల రెపరెపలతో సిటీలో ఎటుచూసినా ఎన్నికల జోష్‌ నెలకొంది. ప్రచార సామగ్రి తయారీ జోరందుకుంది.  

పర్యావరణ క్లాత్‌తో..   
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా భావించి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారంలో ప్లాస్టిక్, పాలిథిన్‌తో తయారైన పోస్టర్లు, బ్యానర్లను వాడుతున్నారు.  ఆయా సంస్థల నిర్వాహకులు ప్రచార సామగ్రిని అభ్యర్థుల డిమాండ్‌ మేరకు ప్రింటింగ్‌ చేసి అందిస్తున్నారు.  

  • ఉదయం నుంచి సాయంత్రం వరకు డోర్‌ టు డోర్‌ తిరిగి ఓటర్లను కలిసి తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రచార రథాలు, డప్పు దరువులు, తెలంగాణ ఆటాపాటలతో ప్రచారం చేస్తున్నారు.  
  • సాయంత్రం కుల సంఘాలు, కాలనీ, అపార్ట్‌మెంట్, గేటేడ్‌ కమ్యూనిటీల అసోసియేషన్‌ సభ్యులతో సమావేశమవుతున్నారు. తాజాగా యువనేత కేటీఆర్‌ నగరంలోని క్రిస్టియన్స్‌ అసోసియేషన్లను కలుస్తున్నారు. 
మరిన్ని వార్తలు