విభేదాలు పక్కన.. యాత్రలు పక్కాగా!

5 Mar, 2023 01:33 IST|Sakshi

మండల కాంగ్రెస్‌ అధ్యక్షుల భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపు 

గాందీభవన్‌లో సమీక్ష సమావేశం.. హాజరైన ఉత్తమ్, భట్టి తదితరులు 

16 నుంచి భట్టి పాదయాత్ర.. ఠాక్రే గ్రీన్‌సిగ్నల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్నిస్థాయిల్లో ఉన్న పార్టీ నేతలు విభేదాలను పక్కనపెట్టి హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలను కలిసికట్టుగా విజయవంతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలపై శనివారం ఆ పార్టీ మండలాల అధ్యక్షులతో గాందీభవన్‌ లో ఆయన సమీక్ష నిర్వహించారు.

మాణిక్‌రావ్‌ ఠాక్రే మాట్లాడుతూ జోడో యాత్రల్లో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సందేశం తెలంగాణలోని ప్రతి ఇంటికీ చేరే లా పనిచేయాలని శ్రేణులకు పిలుపునిచ్చా రు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులన్నింటినీ అదానీకి కట్టబెడుతుంటే రాష్ట్రంలోని కేసీఆర్‌ ప్రభుత్వం పేదల భూములు గుంజుకుంటోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను, కాంగ్రెస్‌ పాలనలో జరిగిన మంచి పనులను ప్రజలకు వివరించేందుకు యాత్రలను వినియోగించుకోవాలన్నారు.

రానున్న 15 రోజులపాటు రాష్ట్రంలో జోడో యాత్రల ను జోరుగా నిర్వహించాలని, ఆ తర్వాత స మీక్ష జరుపుతామని ఠాక్రే చెప్పారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకారులుగా మారాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ హయాంలో కట్టిన పవర్‌ ప్రాజెక్టులతో రాష్ట్రంలో కరెంటు ఇస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు తాపత్రయపడుతోందని విమర్శించారు. కాగా, ఈనెల 16 నుంచి సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రకు పార్టీ నేతలంతా సహకరించి విజయవంతం చేయాలని   ఠాక్రే పార్టీ శ్రేణులకు సూచించారు. 

రాజకీయాలు కలుషితం: ఉత్తమ్‌ 
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ కెపె్టన్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో అత్యంత కష్టమైన పని గడప గడపకూ ప్రచారమేనని, ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఆ పనినే భుజాన పెట్టుకుందని అన్నా రు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రాజకీయాలు కలుషితం అయ్యాయని, మొత్తం డబ్బు మయం చేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఖర్చు తగ్గించుకునేందుకు ఇంటింటికీ ప్రచారం ఉపయోగపడుతుందని చెప్పారు.

మాజీ ఎంపీ వి. హనుమంతరావు మాట్లాడుతూ పార్టీ లో నేతలు గొడవలు పడితే కార్యకర్తలే కొట్టే పరిస్థితుల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షకు జోడో యాత్రల తెలంగాణ సమన్వయకర్త గిరీశ్‌ చోడంకర్, ఇన్‌చార్జి ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌ చౌదరి, నదీమ్‌ జావెద్, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు హర్కర వేణుగోపాల్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీల అధ్యక్షులు, మండల పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు