‘భయపడేది లేదు.. ఏం జేస్తవో చేసుకో’.. కేటీఆర్‌ సవాల్‌

16 Mar, 2023 03:01 IST|Sakshi

మోదీకి, ఈడీకి, బోడీకి భయపడేది లేదు .. దొంగలే భయపడుతరు 

నీతిమంతులెవరో, అవినీతిపరులెవరో ప్రజలే తీర్పిస్తరు 

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు రాకుండ జెయ్యాలె... 

ప్రజా కోర్టులోనే తేల్చుకుందాం! 

కేసీఆర్‌ను మూడోసారిముఖ్యమంత్రిని జేద్దాం 

పిట్లం సభలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, కామారెడ్డి: ‘భయపడేది లేదు.. ఏం జేస్తవో చేసుకో.. మోదీకి, ఈడీకి, బోడీకి, ఎవ్వనికీ భయపడేది లేదు..ఏం పీక్కుంటవో పీక్కో... భయపడేది దొంగలు.. మనం భయపడాల్సిన అవసరం లేదు. కచ్చితంగా ప్రజల దగ్గరకు పోదాం.. ప్రజాకోర్టులో తేల్చుకుందాం. ఎవరు నీతి మంతులో, ఎవరు అవినీతి పరులో, ఎవరు ఏం తప్పు చేసిండ్రో, ఒప్పు జేసిండ్రో.. ప్రజాక్షేత్రంలో ప్రజలే 2023లో తీర్పు చెప్పుతరు’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్‌ శాఖల మంత్రి కే తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని సవాల్‌ చేశారు.

కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజక వర్గంలో రూ.470 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన నాగమడుగు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పిట్లం మండల కేంద్రంలో నిరహించిన బహిరంగ సభలో `మాట్లాడుతూ ప్రధాని మోదీ మహానటుడు అంటూ ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల సమయంలో జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తానన్న మోదీ, డబ్బులన్నీ తన స్నేహితుడు అదానీ ఖాతాలో జమ చేశారని, దేశ సంపదను దోచిపెట్టాడని విమర్శించారు.

దోస్తు ఖాతాలో నింపిన డబ్బులను చందాల రూపంలో తీసుకుని, ప్రతిపక్ష పారీ్టలను చీల్చడం, ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలను పడగొట్టడం చేస్తూ అద్భుతమైన నటన ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నపుడు గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.4 వందలు ఉంటే ఆయన్ను సన్నాసి అని తిట్టారని, మరి మోదీ పాలనలో సిలిండర్‌ ధర రూ.1200 అయ్యిందని, దీనికి ఏమనాలని ప్రశ్నించారు. అందుకే బీజేపీకి డిపాజిట్టు కూడా రాకుండా చూడాలని  కోరారు. 

ఫేకుడు, జోకుడే తప్ప బండి చేసేందేమీ లేదు 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఫేకుడు, జోకుడే తప్ప చేసిందేమీ లేదని కేటీఆర్‌ విమర్శించారు. బీజేపీ తెలంగాణకు పట్టిన శని, దరిద్రం అని, వచ్చే ఎన్నికల్లో పుట్టగతులు లేకుండా చేయాలని ప్రజలను కోరారు. యాభై ఐదేళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు ఏమీ చేయకుండా, ఇప్పుడు ఒక్క చాన్స్‌ అంటూ పీసీసీ అధ్యక్షుడు తిరుగుతున్నాడని, అన్ని సార్లు అవకాశం ఇస్తే ఎందుకు చేయలేదని నిలదీశారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి అయి హాట్రిక్‌ సాధిస్తారని, జుక్కల్‌లో ఎన్నడూ జరగనంత అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే సింధేను ఈ సారి 72 వేల మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సభలో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్‌సింధే, బిగాల గణేశ్‌గుప్తా, జాజాల సురేందర్, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు