బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలి

2 Apr, 2022 05:08 IST|Sakshi

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ వైఖరిని వ్యతిరేకించే కాంగ్రెస్, వామపక్ష, ప్రాంతీయ పార్టీలన్నీ సమైక్యఫ్రంట్‌గా ఏర్పడాలని డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కోరారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రాజకీయ స్వార్థాలను విడిచిపెట్టి దేశాన్ని రక్షించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో డీఎంకేతో మైత్రి మాదిరిగానే దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా సూత్రప్రాయమైన మైత్రిని ఏర్పర్చుకోవాలని కాంగ్రెస్‌ పార్టీకి ఆయన విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీలో శుక్రవారం ఎంకే స్టాలిన్‌ పీటీఐకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘భారతదేశం భిన్నత్వాన్ని, సమాఖ్య విధానం, లౌకికత, ప్రజాస్వామ్యం, సౌభ్రాతృత్వం, రాష్ట్రాల హక్కులు, విద్యారంగ హక్కులను పరిరక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రాజకీయ స్వార్థాన్ని పక్కనబెట్టి ఏకం కావాలి. ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి దేశాన్ని కాపాడుకోవాలి’అని ఆయన అన్నారు. బీజేపీ పట్ల తమది వ్యక్తిగత ద్వేషం కాదన్నారు. అంశాల ప్రాతిపదికగానే బీజేపీ విధానాలను తాము విమర్శిస్తున్నామని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో డీఎంకే ఎప్పుడూ కీలకభూమిక పోషిస్తూనే ఉందన్నారు.

పార్లమెంట్‌లో డీఎంకే మూడో అతిపెద్ద పార్టీ అని చెప్పారు. ‘రాష్ట్రాల రాజకీయాలన్నీ కలిస్తేనే జాతీయ రాజకీయాలు. అంతే తప్ప, జాతీయ, రాష్ట్ర రాజకీయం అంటూ వేర్వేరుగా ఉండవు’అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ బలహీనంగా మారినందున బీజేపీకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో ప్రాంతీయ పార్టీలే కీలకంగా ఉండా లంటూ వస్తున్న వాదనపై ఆయన స్పందిస్తూ.. ఈ విధానం కొన్ని రాష్ట్రాల్లో సరైంది కావచ్చు. కానీ, చాలా రాష్ట్రాల విషయంలో ఈ వైఖరి సరిపోదు. బీజేపీని వ్యతిరేకించే  పార్టీలన్నీ ఏకం కావాలి. మా రాష్ట్రంలో బీజేపీతో విభేదించే పార్టీలతో కూటమిగా ఏర్పడి, లౌకిక శక్తులను ఏకం చేశాం. కాంగ్రెస్‌ పార్టీ కూడా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఇదే మైత్రితో వ్యవహరించాలని స్టాలిన్‌ అన్నారు

మరిన్ని వార్తలు