రాష్ట్రంపై ఎన్నాళ్లీ వివక్ష?

3 Feb, 2022 05:02 IST|Sakshi
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నేతలు

వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలు

ఏడేళ్లుగా రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేస్తోందని ఆవేదన 

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తీవ్ర అన్యాయం చేశారని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వామపక్ష పార్టీలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరిపాయి. రాస్తారోకోలు, ప్రదర్శనలు, సభలు జరిపి కేంద్రం తీరుపై భగ్గుమన్నారు. విజయవాడలోని పాత బస్టాండ్‌ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏడేళ్లుగా రాష్ట్రానికి అన్ని రకాలుగా తీరని ద్రోహం చేస్తూనే ఉందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్‌ ప్లాంట్, గత బడ్జెట్‌లో ప్రకటించిన విశాఖ రైల్వేజోన్‌ వంటి కీలక అంశాలను పూర్తిగా విస్మరించారన్నారు. పోలవరానికి నిధులు కేటాయించకుండా, కనీసం రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంపై ఎందుకింత కక్ష? ఎన్నాళ్లీ వివక్ష? అని ధ్వజమెత్తారు. 

వైఎస్సార్‌సీపీ, టీడీపీ కలిసి రావాలి
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర నిర్లక్ష్య, నిరంకుశ వైఖరిని ఎండగడుతూ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తామని నేతలు ప్రకటించా రు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీ, టీడీపీ కూడా వీధుల్లోకి రావాలని, అవసరమైతే బంద్‌ చేయాలని కోరారు. వామపక్షనేతలు వెంక య్య, శంకర్, విల్సన్, వనజ, జి.కోటేశ్వరరావు, బాబూరావు, కృష్ణ, కాశీనాథ్, అమరనాథ్, ఖాదర్‌ బాషా మాట్లాడారు. విశాఖపట్నంలో సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై నిరసన తెలిపారు. శ్రీకాకుళం, విజయనగ రం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి.  

మరిన్ని వార్తలు