కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

6 Dec, 2020 13:04 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాజకీయాల్లో విపక్ష కాంగ్రెస్‌-జేడీయూ మధ్య మరోసారి మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్‌ను టార్గెట్‌గా చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ చీఫ్‌ హెచ్‌డీ కుమారస్వామి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌తో చేతులు కలపడం మూలంగా తన 12 ఏళ్ల రాజకీయ జీవితంలో సాధించుకున్న ఘనతంతా వృథా అయిపోయిందని అన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య తనపై అనేక కుట్రలు పన్నారని ఆరోపించారు. ఆయన కారణంగానే అనేకసార్లు కన్నీరుకార్చాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. (యడియూరప్ప స్థానంలో యువ సీఎం!)

గతంలో తాను సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ చేసిన కుట్రలను గుర్తించలేకపోయానని పేర్కొన్నారు. తనన కలల్ని, రాజకీయ జీవితాన్ని ఆ పార్టీ నేతలు ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తం‍డ్రి హెచ్‌డీ దేవెగౌడ ఒత్తిడి మేరకే కాంగ్రెస్‌తో చేతులు కలిపానని వెల్లడించారు. తాను బీజేపీతో సన్నిహితంగా మెలిగితే మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశం ఉందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో స్నేహంగా ఉన్న సమయంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించామని గుర్తుచేశారు. కాగా (2006-07) సమయంలో బీజేపీ మద్దతుతో కుమారస్వామి సీఎంగా సేవలు అందించిన విషయం తెలిసిందే. (పవార్‌ సంచలన వాఖ్యలు.. ఖండించిన కర్ణాటక)

మరోవైపు కుమారస్వామి వ్యాఖ్యలపై సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ కుట్రలు చేసిందన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అబద్దాలు చెప్పడంలో ఆ కుటుంబం దిట్టగా వర్ణించారు. అన్నీ చేసి చివరకు కన్నీరు కార్చడం కుమారస్వామికే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపార్టీకి సరైన సంఖ్యాబలం లేకపోవడంతో కాంగ్రెస్‌ మద్దతు కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కొన్ని నెలలకే ఆ ప్రభుత్వం పడిపోయింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా, బీజేపీకి మద్దతు ప్రకటించడంతో బీఎస్‌ యడియూరప్ప సీఎం పీఠాన్ని అధిష్టించారు.
 

మరిన్ని వార్తలు