ట్రాఫిక్‌ జరిమానాలు ఆపేయాలి: జగ్గారెడ్డి 

15 Sep, 2020 04:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఆటో రిక్షాలు, ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్‌ చలానాలు అధికంగా విధిస్తున్నారని, సీఎం ఆదేశాల మేరకు భారీ జరిమానాలు వేస్తున్నారని ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన గన్‌పార్క్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. ట్రాఫిక్‌ పోలీసులకు లక్ష్యం ఇచ్చినట్టు కనిపిస్తోందని, రాష్ట్రం మొత్తం ఈ చలానాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చలానా కట్టకపోతే పెనాల్టీలు వేస్తున్నారని, ఆటో నడిపే వారికి వారు సంపాదించే సగం డబ్బు చలానాలకే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో ఈ జరిమానాలు వేసి ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం అవసరమా అని ప్రశ్నించారు. తక్షణమే ఈ జరిమానా వేసే విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశం అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు.  

మరిన్ని వార్తలు