ఉద్యమాల పురిటిగడ్డకు వారసులొస్తున్నారు.. ఎమ్మెల్యే రేసులో నేతల పిల్లలు

1 Aug, 2022 15:15 IST|Sakshi

ఎమ్మెల్యే రేసులో ఎమ్మెస్సార్, జువ్వాడి మనవలు

వేములవాడ, హుజూరాబాద్, కోరుట్ల, హుస్నాబాద్‌ నుంచీ వారసులు

కరీంనగర్‌ మేయర్‌ బరిలో మంత్రి గంగుల కుమారుడు..?

రాజకీయ వేదికకు రంగం సిద్ధం చేస్తున్న నేతలు 

సాక్షి, కరీంనగర్‌: రాష్ట్ర రాజకీయాల్లోనే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాది ప్రత్యేక స్థానం. ఉద్యమాల పురిటిగడ్డగా పేరొందిన జిల్లా.. మొదటి నుంచీ రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగి ఉంది. రాజకీయ వారసత్వాలు ఈ జిల్లాకు కొత్తేంకాదు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న ఎమ్మెల్యేల్లో మంథని, సిరిసిల్ల, హుస్నాబాద్‌ స్థానాల్లో ఉన్నవారు ఈ తరహాలోనే రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లోనూ తమ వారసులను బరిలో దింపేందుకు చాలామంది సీనియర్‌ నేతలు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు.

కొందరు కుమారులను, కుటుంబసభ్యులను బరిలో దించే యోచనలో ఉండగా.. మరికొందరు తమ రాజకీయ వారసత్వాన్ని మూడోతరానికి అందించే ప్రయత్నాల్లో తలమునకలయ్యాయి. ‘బంధువులు రుతువుల్లాంటి వారు. వస్తారు.. పోతారు.. కానీ, వారసులు చెట్లలాంటివారు.. వస్తే పాతుకుపోతారు’ అంటూ ఓ సినిమాలోని డైలాగు ప్రస్తుతం జిల్లా రాజకీయాలకు సరిగ్గా సరిపోతోంది. మొత్తానికి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలన్నీ తమ కుటుంబ సభ్యులను, మనవళ్లను రాజకీయ యవనికపైకి 
తీసుకొస్తుండటం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.  

 మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న తనయుడు శ్రీరాం
ఇందుర్తి నియోజకవర్గం నుంచి 1999లో ఎమ్మెల్యేగా గెలిచిన బొమ్మ వెంకన్న తనయుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి ఈసారి హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జీగా కొనసాగుతున్న శ్రీరాం.. నియోజకవర్గంలో పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు.

ఈటల రాజేందర్‌ సతీమణి జమునారెడ్డి
ఈసారి తాను హుజూరాబాద్‌ కాకుండా గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని ఈటల రాజేందర్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈసారి జమునారెడ్డిని రంగంలోకి దించుతారన్న ప్రచారం జోరందుకుంది. ఇప్పటిదాకా హుజూరాబాద్‌ నుంచి మొత్తం ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఈటల గెలిచారు. ప్రతిసారీ డమ్మీ అభ్యర్థిగా జమునారెడ్డి నామినేషన్‌ వేస్తూ వచ్చారు. నియోజకవర్గపు వ్యవహారాలన్నీ తెలిసి ఉండటం ఆమెకు కలిసి వస్తుందంటున్నారు. 

కోరుట్లలో కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కుమారుడు సంజయ్‌
వయోభారం కారణంగా విద్యాసాగర్‌రావు తన కుమారుడు సంజయ్‌ని ఈసారి తన స్థానంలో పోటీ చేయిస్తారని సమాచారం. విద్యాసాగర్‌రావుకు ఉన్న అనుభవం, సంజయ్‌.. కేటీఆర్‌ కలిసి చదువుకోవడం కలిసి వచ్చే అంశాలని స్థానికులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల డబుల్‌ బెడ్‌ ఇళ్ల ప్రారంభోత్సవం సమయంలో మంత్రి కేటీఆర్‌ పదే పదే సంజయ్‌ పేరును పలకడాన్ని కూడా ఉదాహరిస్తున్నారు.

 


విద్యాసాగర్‌రావు కుమారుడు వికాస్‌
విద్యాసాగర్‌రావు కుమారుడు వికాస్‌.. కొంతకాలంగా వేములవాడ నియోజకవర్గంలో వైద్యశిబిరాలు నిర్వహిస్తూ స్థానికంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన కుటుంబ నేపథ్యంతో బీజేపీ నుంచి ఈసారి వేములవాడ నుంచి బరిలో దిగుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఎమ్మెస్సార్‌ మనవడు మెన్నేని రోహిత్‌రావు
మూడుసార్లు ఎంపీగా.. ఆర్టీసీ చైర్మన్‌గా.. రాష్ట్ర మంత్రిగా.. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగి.. కాంగ్రెస్‌ పార్టీ పటిష్టత కోసం పని చేసిన దివంగత నేత ఎం.సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్‌) మనవడు మెన్నేని రోహిత్‌రావు రానున్న ఎన్నికల్లో కరీంనగర్‌ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు నియోజకవర్గంలో పార్టీ అధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తాత ఎమ్మెస్సార్‌ చేసిన సేవలు, అభివృద్ధి తనకు కలసి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి గంగుల కుమారుడు హరిహరణ్‌
మంత్రి గంగుల కమలాకర్‌ కుమారుడు గంగుల హరిహరణ్‌ రాజకీయ ప్రవేశం ఖాయమని ప్రచారం జోరందుకుంది. ఇటీవల హరిహరణ్‌ జన్మదిన వేడుకల సమయంలో గంగుల వారసుడిగా హరిహరణ్‌ వచ్చే కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేయర్‌గా పోటీ చేస్తారని అనుచరులు హడావుడి చేయడం త్వరలోనే ఆయన రాజకీయాల్లోకి వస్తారన్న సంకేతాలు కేడర్‌కు వెళ్లినట్లయింది. 

 
 

జువ్వాడి చొక్కారావు మనవడు నిఖిల్‌ చక్రవర్తి
తెలంగాణ సమరయోధుడు, మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు మనువడు నిఖిల్‌ చక్రవర్తి కూడా ఈసారి కరీంనగర్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టికెట్‌పై కన్నేశారు. యూత్‌ కాంగ్రెస్, కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్న నిఖిల్‌ చక్రవర్తి తాత వారసత్వం తనకు అన్నివిధాలా కలిసి వస్తుందని ధీమాగా ఉన్నారు.

మరిన్ని వార్తలు