సూర్యాపేట ఎస్పీని సస్పెండ్‌ చేయాలి

18 Sep, 2022 03:01 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న ఎంపీ కోమటిరెడ్డి  

మూడు మర్డర్‌ కేసులు ఉన్న జగదీశ్‌రెడ్డి బాహుబలా?: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

యాదగిరిగుట్ట: సూర్యాపేట బహిరంగసభలో ఆ జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ మంత్రి జగదీశ్‌రెడ్డిని బాహుబలితో పోల్చడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ఎస్పీ హోదాలో ఉన్న ఐపీఎస్‌ అధికారి...జయహో జగదీశ్‌రెడ్డి అనడం సిగ్గుచేటన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శనివారం విలేకరుల సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ...పోలీస్‌ దుస్తులకు బదులు గులాబీ చొక్కా వేసుకుని ఆ వ్యాఖ్యలు చేసుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఇసుక మాఫియా నడిపిస్తున్నారని, మూడు హత్యానేరం కేసులున్న వ్యక్తిని జయహో అని సంబోధిస్తారా అని మండిపడ్డారు.

డీజీపీకి ఏమాత్రం ధైర్యం ఉన్నా ఎస్పీని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 48 మంది అదనపు డీజీపీ క్యాడర్‌ కలిగిన ఐజీలు రిపోర్టింగ్‌ చేసి డీజీపీ కార్యాలయంలో పోస్టింగ్‌ లేకుండా ఉన్నారని, వారందరికీ వెంటనే పోస్టింగ్‌ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నానని కోమటిరెడ్డి అన్నారు. సమైక్యతా వజ్రోత్సవాలకు సైతం మహిళలను రూ.300 ఇచ్చి తరలించారని విమర్శించారు. 

మరిన్ని వార్తలు