బిహార్‌ డిప్యూటీ సీఎం.. తెరపైకి ఇద్దరి పేర్లు

15 Nov, 2020 18:06 IST|Sakshi

పట్నా : బిహార్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరేందుకు ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. ఎన్డీయే కూటమి తరుఫున ముఖ్యమంత్రిగా జేయూడీ అధినేత నితీష్‌ కుమార్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది మంత్రులు సైతం ప్రమాణం చేసే అవకాశం ఉంది. అయితే బిహార్‌ డిప్యూటీ సీఎం పదవిపై కొంత  ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సుశీల్‌ మోదీ స్థానంలో ఇద్దరు కొత్త వ్యక్తులను నియమిస్తారని తెలుస్తోంది. వీరిలో ప్రధానంగా బీజేపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే తారక్‌ కిషోర్‌ ప్రసాద్‌తో పాటు రేణు దేవి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ నితీష్‌తో పాటు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు స్వీకర్‌ పదవి సైతం బీజేపీకే దక్కే అవకాశం ఉంది. (35 ఏళ్లుగా పోటీకి దూరం.. ఏడోసారి సీఎం)

అయితే సుశీల్‌ మోదీ ఎందుకు తప్పుకున్నారు అనేది తెలియాల్సి ఉంది. బీజేపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. డిప్యూటీ సీఎం పదవిపై సుశీల్‌ అంతగా ఆసక్తి చూపడంలేనట్లు తెలుస్తోంది. అయితే నితీష్‌ కేబినెట్‌లో కీలకమైన శాఖలన్నీ బీజేపీకే దక్కే అవకాశం ఉండటంతో మంత్రివర్గంలోనే బలమైన శాఖను కట్టబెడతారనే ప్రచారం కూడా సాగుతోంది. మరోవైపు మంత్రి పదవుల కోసం బీజేపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. కాగా 74 స్థానాలు బీజేపీ గెలుచుకోగా.. జేడీయూ 44 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. 76 స్థానాల్లో విజయకేతనం  ఎగరేసిన ఆర్జేడీ ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోనుంది. 

మరిన్ని వార్తలు