టీడీపీ నేతల్లో అంతర్మథనం.. అడకత్తెరలో ‘ఆ ముగ్గురు’!

26 Oct, 2021 08:49 IST|Sakshi

బొండా, బుద్ధా, మీరాల సమాలోచనలు

అంతుబట్టని చంద్రబాబు, కేశినేనిల వైఖరి

ఢిల్లీ టూర్‌ నేపథ్యంలో ముఖ్యులతో ముగ్గురి మంతనాలు

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి(కృష్ణా జిల్లా): మీది తెనాలి, మాది తెనాలి.. మనం మనం బరంపురం.. తెలుగు సినిమాల్లోని పాపులర్‌ డైలాగ్‌లివి.. మనమంతా ఒకటేనని తెలియజెప్పే సన్నివేశాలకు సంబంధించినవి. తాజా పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నేతల తీరు చూస్తే అచ్చం సినిమాల్లోని సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) వ్యవహారశైలిని నిశితంగా గమనిస్తే ఆయనిక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును కలవబోరని స్వపక్షీయులు భావించారు. (చదవండి: గెస్ట్‌ ‘హౌస్‌’ బాబు.. కుప్పంపై చంద్రబాబు కపటప్రేమ)

చంద్రబాబు కూడా కేశినేనిని తన దరి చేరనీయబోరని స్పష్టమైన అంచనాలో ఉన్నారు. కానీ ఆ పార్టీలోని ముఖ్య నాయకుల ఆలోచనలు, అభిప్రాయాలు ఒక్కసారిగా తల్లకిందులయ్యాయి. మరీ ముఖ్యంగా విజయవాడ నగరానికి చెందిన మాజీ ఎమ్యెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మరో ముఖ్య నాయకుడు నాగుల్‌ మీరాలది కక్కలేని మింగలేని పరిస్థితి. పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ముగింపునకు కొన్ని గంటల ముందు నుంచి తాజాగా సోమవారం చంద్రబాబు ఢిల్లీ పర్యటన, అనంతర పరిణామాలను నిశితంగా గమనిస్తే ఔరా! నాయకుల మాటలకు అర్థాలే వేరులే అన్నది రూఢీ అవుతోంది.
చదవండి: ఆంధ్రా పుణ్యంతోనే అన్నం తింటున్నాం..

విజయవాడ టీడీపీలో ముసలం.. 
సాధారణ ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా కేశినేని నాని, ఎమ్మెల్యేలుగా వల్లభనేని వంశీమోహన్, గద్దె రామ్మోహన్‌లు గెలుపొందారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ చిరునామా కరువైన పరిస్థితులు.. మున్సిపల్‌ ఎన్నికల్లో, మరీ ముఖ్యంగా విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తీసికట్టే అయ్యింది. కార్పొరేటర్లకు సీట్ల కేటాయింపు, ప్రచార సమయంలో కేశినేని నానికి బొండా, బుద్ధా, నాగుల్‌మీరా వర్గాల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. నాని తన కుమార్తె శ్వేతను మేయర్‌ అభ్యర్థని స్వయం ప్రకటన ఎలా చేస్తారంటూ విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి మరీ దుమ్మెత్తిపోశారు. ఇదంతా కూడా చంద్రబాబునాయుడుకు తెలిసే జరిగిందని కేశినేని వర్గం అభిప్రాయపడుతూ వచ్చింది.

తానిక పార్టీ కార్యక్రమాలలో పాల్గొనబోనని, ఎన్నికలకు దూరంగా ఉంటానని, కార్పొరేటర్‌ అయిన తన కుమార్తె శ్వేత పరిస్థితి కూడా అంతేనని ఎంపీ తేల్చి చెప్పేశారు. ఇటీవలే కేశినేని భవన్‌లో చంద్రబాబు ఫొటోను పీకి పారేయించి అదే స్థానంలో రతన్‌టాటాతో తాను కలిసి ఉన్న ఫొటోను నాని ఏర్పాటు చేయించారు.  
చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపిన సమయంలో ఎమ్మెల్యే జోగి రమేష్‌ తదితరులు కరకట్ట వెంబడి ఉన్న చంద్రబాబు ఇంటి వద్దకు ప్రశ్నించడానికి వెళ్లారు. ఆ సమయంలోనూ పార్టీకి, చంద్రబాబుకు సానుకూలంగా నోరు విప్పలేదు సరికదా కొందరు ముఖ్యనాయకులు స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని కోరినా.. ‘ఛత్, నేనా, అతనికి అనుకూలంగా మాట్లాడటమా’ అంటూ కేశినేని ఈసడించుకున్నారని స్వపక్షీయులే గుర్తుచేస్తున్నారు.

వారి రాయబారంతో..  
పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రిని దుర్భాషలాడిన నేపథ్యంలో పార్టీ ఆఫీసుపై దాడి జరిగింది. దీనిపై కూడా ఎంపీ స్పందించలేదు. ఉన్నదే ముగ్గురు లోక్‌సభ సభ్యులు. అందులోనూ విజయవాడ, గుంటూరు ఎంపీలు సానుకూలంగా స్పందించకపోతే ఎలాగని పార్టీకి సానుకూలంగా ఉండే సామాజికవర్గం పెద్దలు మదనపడ్డారు. అధినేత సూచనలతో టీడీ జనార్ధన్, ధూళిపాళ్ల నరేంద్రలు కేశినేని వద్దకు రాయబారం నడిపారు. ఆ తర్వాత విజయవాడ, జిల్లాలోని అదే వర్గానికి చెందిన కేశినేనికి సన్నిహితులైన మరికొందరు సముదాయించారని విశ్వసనీయ సమాచారం.

బాబు మంతనాలతో.. 
మొత్తానికి మెత్తబడిన కేశినేనిని బాబు నిరసనదీక్ష వద్దకు తీసుకెళ్లిన రాయబారులు ప్రసగించాలని కోరగా.. తొలుత ససేమిరా అంటూ భీష్మించుకున్నారు. ఆ తరువాత బాబు దీక్ష వద్ద నుంచి బస్సులోకి చేరి కేశినేనితో మంతనాలు జరిపి మాట్లాడేందుకు ఒప్పించడంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి. వీటన్నింటినీ బొండా, బుద్ధాల బ్యాచ్‌ నేరుగానే గమనించింది.  

‘వాళ్లూ.. వాళ్లు’ ఒక్కటయ్యారా?
చంద్రబాబు బస్సులోకి వెళ్లి మంతనాలు జరిపిన తర్వాత కేశినేని వీరావేశంతో దీక్ష వద్ద ప్రసంగించారు. సవాళ్లు విసిరారు. సోమవారం ఢిల్లీలోనూ కేశినేని చురుగ్గా వ్యవహరించిన నేపథ్యంలో తమ పరిస్థితి ఏంటనే మథనం బొండా, బుద్దా, మీరాల్లో మొదలైంది. ‘వాళ్లూ వాళ్లు ఒక్కటయ్యారు. ఆ వర్గం వారందరూ కూడబలుక్కున్నారు. మా విషయంలో కేశినేని డిమాండ్‌ ఏంటో? అధినేత ఆయనకు ఏం హామీ ఇచ్చారో?’ అంటూ ముగ్గురూ మల్లగుల్లాలు పడుతున్నారనేది సమాచారం. ‘చివరకు అటుఇటూ కాకుండా మధ్యలో నలిగిపోయేది మనమేనా?’ అని ఆ ముగ్గురి ముఖ్య అనుచరులు వాపోతున్నట్లు తెలిసింది. మొన్న ఎన్నికల సమయంలో కార్పొరేటర్ల టిక్కెట్ల కేటాయింపులో కేశినేని వ్యవహారశైలి తేలిపోయిన నేపథ్యంలో తమపట్ల ఇక మౌనంగా ఎందుకు ఉంటారనే అనుమానాలు కూడా వారిలో వ్యక్తమవుతున్నాయి. 

మరిన్ని వార్తలు