Nandigram: నందిగ్రామ్‌.. హై టెన్షన్‌

3 May, 2021 05:21 IST|Sakshi
సువేంధు అధికారి

క్షణ క్షణం మారిన మెజారిటీ

1,956 ఓట్ల ఆధిక్యంతో సువేంధు గెలుపు

కోర్టుకు వెళ్తానన్న మమతా బెనర్జీ

కోల్‌కతా: తృణమూల్‌ చీఫ్‌ మమతా బెనర్జీ తొలిసారి బరిలో నిలిచిన పశ్చి మ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ నియోజకవర్గ ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠత రేపాయి. కౌంటింగ్‌ కొనసాగుతున్న కొద్దీ మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేంధు అధికారి మధ్య క్షణ క్షణం మారిపోతున్న ఓట్ల మెజారిటీ... మొత్తం రాష్ట్ర ఎన్నికల ఘట్టంలోనే అత్యంత ప్రధానమైనదిగా నిలిచింది. ఇద్దరు ప్రధాన పార్టీల ప్రత్యర్థుల మధ్య అటూ ఇటూ దోబూచులాడిన మెజారిటీ.. చివరకు సువేంధు అధికారిని వరించింది. మమతా బెనర్జీపై స్వల్ప ఆధిక్యంతో గెలిచినట్లు ఎన్నికల సంఘం ఎట్టకేలకు ప్రకటించింది. అయితే, నందిగ్రామ్‌ ఫలితాలపై తాను కోర్టుకు వెళ్తానని మమతా ప్రకటించారు.  

అంతకుముందు ఆదివారం ఉదయం కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవగా కొద్దిసేపటికే సువేంధు మమత కంటే ఆధిక్యంలోకి వచ్చారు.ఆ తర్వాత సువేంధు మెజారిటీ ఏకంగా ఎనిమిది వేల దాకా వెళ్లింది. మధ్యాహ్నందాకా సువేంధుదే పైచేయి. మధ్యాహ్నం నుంచి నెమ్మదిగా పుంజుకుని మమత ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఆధిక్యత మరొకరి చెంతకు చేరింది.

ఒకానొక దశలో సువేంధు కేవలం ఆరు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపులో ప్రతీ రౌండ్‌లో మెజారిటీ సువేంధు, మమత మధ్య మారుతూ వచ్చింది. సువేంధు 1,200 ఓట్ల మెజారిటీలో గెలిచారని వార్తలు రాగా, ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 1,956 ఓట్ల ఆధిక్యంతో సువేంధు అధికారి గెలిచారని ఎన్నికల సంఘం ప్రకటించింది.

త్యాగాలు తప్పవు..
ఈసీ ప్రకటనపై మమతా బెనర్జీ వెంటనే స్పందించారు. ‘‘నందిగ్రామ్‌లో ఓటమిని అంగీకరిస్తున్నాను. మరేం ఫరవాలేదు. అయితే, నందిగ్రామ్‌లో అక్రమాలు జరిగాయని విన్నాను. దీనిపై కోర్టుకు వెళతాను. మనం మొత్తం రాష్ట్రాన్నే గెలిచాం. ఇంతటి ఘన విజయం సాధించినపుడు ‘నందిగ్రామ్‌’లో ఓటమిలాంటి త్యాగాలు తప్పవు’’ అని ఫలితాల అనంతరం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.  నందిగ్రామ్‌లో రీకౌంటింగ్‌ జరపాలని ఈసీని టీఎంసీ కోరగా అందుకు ఈసీ నిరాకరించింది.

మరిన్ని వార్తలు