మమత నామినేషన్‌ తిరస్కరించాలంటూ బీజేపీ ఫిర్యాదు

16 Mar, 2021 03:37 IST|Sakshi

ఈసీకి బీజేపీ అభ్యర్థి సువేందు ఫిర్యాదు 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ శాసనసభ స్థానం నుంచి పోటీ చేయడానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత మమతా బెనర్జీ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించాలని ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఎన్నికల సంఘాన్ని కోరారు. మమతా బెనర్జీపై ఉన్న ఆరు క్రిమినల్‌ కేసులను ఆమె నామినేషన్‌లో ప్రస్తావించలేదని చెప్పారు. ఇందులో ఐదు కేసులు అస్సాంలో, ఒక కేసు బెంగాల్‌లో సీబీఐ నమోదు చేసిందని తెలిపారు. ఆమె వాటిని నామినేషన్‌ పత్రాల్లో పేర్కొనకుండా తొక్కిపెట్టారని విమర్శించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేసు నంబర్లను కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించానని సువేందు అధికారి చెప్పారు. ప్రస్తుతం ఆయా కేసులు విచారణ దశలో ఉన్నాయన్నారు. చట్ట ప్రకారం మమతా బెనర్జీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. సువేందు అధికారి ఫిర్యాదుపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంకా స్పందించలేదు. 


అది ఓటర్ల ప్రాథమిక హక్కు 
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, తమపై ఉన్న క్రిమినల్‌ కేసులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నామినేషన్‌ పత్రాల్లో పేర్కొనకపోతే ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఆ నామినేషన్‌ను తిరస్కరించవచ్చని 2018 మార్చి నెలలో సుప్రీంకోర్టు ఓ తీర్పులో స్పష్టం చేసింది. అభ్యర్థుల గురించి పూర్తిగా తెలుసుకోవడం ఓటర్ల ప్రాథమిక హక్కు అని పేర్కొంది. నామినేషన్‌ పత్రాల్లో కొన్ని కాలమ్స్‌ను ఖాళీగా ఉంచడం ఆ హక్కుకు భంగం కలిగించినట్లే అవుతుందని తేల్చిచెప్పింది.   

మరిన్ని వార్తలు