‘21 ఏళ్లు ఆ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా’

26 Dec, 2020 20:53 IST|Sakshi

బీజేపీ నేత సువేందు అధికారి విమర్శలు

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం ఓ కంపెనీలా మారిందని, అక్కడ ఎవరికీ క్రమశిక్షణ లేదంటూ బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సుదీర్ఘకాలం పాటు ఆ పార్టీలో కొనసాగినందుకు తాను సిగ్గుపడుతున్నానని పేర్కొన్నారు. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేబినెట్‌లో మంత్రిగా విధులు నిర్వర్తించిన ఆయన ఇటీవలే తన పదవికి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకొన్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన తనకు సముచిత స్థానం దక్క‍కపోవడం, మమతతో విభేదాలు తలెత్తడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో బీజేపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి సువేందు అధికారి శనివారం ప్రసంగించారు. (చదవండి: ఒక్కొక్కరికి రూ. 2.5 లక్షలు: అమిత్‌ షా)

‘‘డాక్టర్‌ శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ త్యాగ ఫలితంగానే మనం నేడు బెంగాల్‌లో జీవించగలుగుతున్నాం. రాష్ట్రంలో ప్రస్తుతం నిరుద్యోగం పెరిగిపోయింది. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తోడు బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది’’ అని పేర్కొన్నారు.  ఇక పార్టీ మారడం గురించి మాట్లాడుతూ.. ‘‘21 ఏళ్ల పాటు తృణమూల్‌తో బంధం కొనసాగించినందుకు సిగ్గుపడుతున్నా. ఆ పార్టీలో అసలు ఇప్పుడు క్రమశిక్షణ లేదు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. జాతీయత, దేశ భక్తి, క్రమశిక్షణకు మారు పేరైన ఈ పార్టీలో ఇప్పుడు నేను కూడా సభ్యుడిని. 

అధిష్టానం మార్గదర్శకత్వంలో రాష్ట్రాన్ని సోనార్‌ బంగ్లాగా  తీర్చిదిద్దడమే మన అందరి లక్ష్యం’’ అంటూ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి దిశానిర్దేశం చేశారు. ‘‘బీజేపీ కార్యకర్తలపై విచక్షణా రహిత దాడులు జరుగుతున్నాయి. తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. పార్టీ కోసం ఇప్పటికే 135 మంది కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారు. ఇవన్నీ పోలీసులకు కనిపించవు’’ అని మమత ప్రభుత్వాన్ని విమర్శించారు. అదే విధంగా పీఎం- కిసాన్‌ యోజన అమలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని సువేందు మండిపడ్డారు.(చదవండి: రాష్ట్రాన్ని నాశనం చేశారు: ప్రధాని మోదీ)

మరిన్ని వార్తలు