రాజ్‌భవన్‌కు కాషాయం రంగు

2 Mar, 2022 04:46 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌ రావు. చిత్రంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి 

గవర్నర్‌ నివాసానికి బీజేపీ రాజకీయాలు అంటగడుతోంది 

వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ట్రాలను ఇబ్బంది పెడుతోంది 

తెలంగాణలో వెలగని దీపం బీజేపీ.. దేశానికి కాగడా టీఆర్‌ఎస్‌ 

మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ అధికారిక నివాసం రాజ్‌భవన్‌కు కాషాయం రంగు పులుముతూ రాజకీయాలను అంటగడుతోందంటూ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు బీజేపీపై మండిపడ్డారు. గవర్నర్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని బీజేపీయే నగ్నంగా బయటపెడుతోందని దుయ్యబట్టారు.

ఆయన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి మంగళవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘గవర్నర్‌ను అవమానిస్తోంది బీజేపీనే. గవర్నర్‌కు ఏదైనా క్లారిఫికేషన్‌ అవసరమైతే సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, అసెంబ్లీ కార్యాలయంతో మాట్లాడతారు. రాజ్‌భవన్‌కు రాజకీయాలు అంటగట్టి గవర్నర్‌ వ్యవస్థను దిగజారుస్తూ అవమానిస్తున్న బీజేపీపై కేసులు నమోదు చేయాలి. ఈ నెల 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయని స్పీకర్‌ నోటిఫై చేశారు. శాసనసభకు ఇమ్యూన్‌ పవర్‌ ఉంటుంది, అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవు అనే అవగాహన కూడా బీజేపీ నేతలకు లేదు. ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తోపాటు ప్రస్తుత గవర్నర్‌ తమిళిసై సహా ఎవరు గవర్నర్‌గా ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గౌరవిస్తూ, అనేక అంశాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించడంలో కేసీఆర్‌ తర్వాతే ఎవరైనా. గవర్నర్‌ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదని నిపుణులు చెప్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాలు ప్రొరోగ్‌ కానందునే బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం లేదనే విషయాన్ని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలుసుకోవాలి’ అని హరీశ్‌రావు చెప్పారు. 

వెలగని దీపం బీజేపీ 
గవర్నర్‌ మహిళ అయినందునే బడ్జెట్‌ సమావేశాలకు ఆహ్వానించడం లేదంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలను హరీశ్‌రావు కొట్టిపారేశారు. గతంలో మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన వెంటనే గుజరాత్‌ గవర్నర్‌ కమలా బేణివాల్‌ను డిస్మిస్‌ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని అక్కడి గవర్నర్‌ ఎందుకు అవమానిస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో తమ పార్టీకి బలం లేకున్నా కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో అధికారం కోసం బీజేపీ గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు శాంతి, సామరస్యం, అభివృద్ధితోపాటు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ పార్టీ దేశానికి వెలుగు చూపే కాగడా అయితే బీజేపీ మాత్రం తెలంగాణలో ఎన్నడూ వెలగని దీపమని అన్నారు.  

అది రాజ్యాంగంలో  లేదు: మంత్రి వేముల 
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు హుందాగా జరుగుతున్నా బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గత సమావేశాలు ప్రొరోగ్‌ కాకుండా గవర్నర్‌ను ఆహ్వానిస్తే తప్పుచేసినట్లు అవుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి్దని గవర్నర్‌ ప్రసంగం ద్వారా తెలియచేయాలని తమకూ ఉంటుందని, బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం లేకపోవడం సాంకేతికపరమైన అంశం మాత్రమేనన్నారు. శాసనసభ ప్రొరోగ్‌ కాకపోవడంతో 1971, 2013, 2019లోనూ ఇదే రీతిలో సమావేశాలు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. 2004లో పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం కూడా రాష్ట్రపతి ప్రసంగం లేకుండానే జరిగిందని, దీనిపై రాందాస్‌ అథవాలే సుప్రీంకోర్టుకు వెళ్లినా కొట్టేసిందన్నారు. బీజేపీ రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని, ఆ పార్టీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. సమా వేశంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు