ఆత్మ నిర్భర్‌ కాదు.. ప్రజల బతుకు దుర్భరం చేశారు

28 Apr, 2022 01:50 IST|Sakshi
ప్లీనరీలో మాట్లాడుతున్న హరీశ్‌రావు

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీశ్‌రావు విమర్శలు

సెస్‌ల రూపంలో నిధుల వసూలు కేంద్రం మానుకోవాలి

సెస్‌లు, రాష్ట్రాలకు పన్నుల వాటాపై తీర్మానం పెట్టిన మంత్రి

సాక్షి, హైదరాబాద్‌: అచ్చేదిన్‌ తెస్తామన్న ప్రధాని మోదీ సర్కారు దేశ ప్రజలకు చచ్చే దిన్‌ తెస్తోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అంటున్న బీజేపీ సర్కారు.. ప్రజల బతుకు దుర్భరంగా మార్చిందని మండిపడ్డారు. టీం ఇండియాలో టీం, థీమ్‌ లేదని.. అంతా రాజకీయ గేమ్‌ అని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వానిది వైఫ ల్యాల చరిత్ర అయితే తెలంగాణ ప్రభుత్వానిది సాఫల్యాల చరిత్ర అన్నారు. పార్టీ ప్లీనరీలో ‘రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపంలో వసూలు చేయడం మానుకోవాలి. డివిజిబుల్‌ పూల్‌లోనే పన్నులు వసూలు చేయాలి’ అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి బలపరిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రాలు ఆర్థి కంగా బలహీనంగా ఉండాలి.. రాష్ట్రాలకు అధికారాలు తగ్గించాలన్నదే బీజేపీ సిద్ధాంతమని ధ్వజ మెత్తారు. కేంద్రం సెస్‌ల రూపంలో వసూలు చేసే మొత్తాన్ని డివిజిబుల్‌ పూల్‌ లోకి తేవాలని డిమాండ్‌ చేశారు. 

ఏడేళ్లలో కేంద్రానికి రూ. 24 లక్షల కోట్లు
‘దేశంలో పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో 41 శాతం రాష్ట్ర ప్రజల హక్కుగా కేంద్రం పంచాలి. కానీ పన్నుల రూపంలో వచ్చే ఆదాయం పంచాల్సి వస్తుందని సెస్‌ల రూపంలో పెద్ద ఎత్తున కేంద్రం డబ్బులు వసూలు చేస్తోంది’ అని మంత్రి అన్నారు. రాష్ట్రానికి 41%ఇవ్వాల్సిన చోట 29.6 శాతమే ఇస్తోందన్నారు. మరో 11.4% సెస్‌ల రూపంలో దొడ్డి దారిన సమకూర్చుకుంటోందని విమర్శిం చా రు. 14, 15వ ఆర్థిక సంఘాలు కూడా రాష్ట్రాలకు 41% వాటా ఇవ్వాలని సూచించాయని గుర్తు చేశా రు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో సెస్‌ల రూపంలో రూ.24 లక్షల కోట్లను సమకూర్చుకుం దని, ఇందులో రాష్ట్రానికి రూ. 54వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. కేంద్రానికి ఏ రూపంలో డబ్బులు వచ్చినా రాష్ట్రాలకు 41 శాతం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాల రుణ పరిమితిపై కేంద్రం ఆంక్షలు విధిస్తోందని విమర్శించారు. 

కొత్తవి తెస్తామని ఉన్నవి అమ్ముతున్నారు
ఏడేళ్లలో దేశ ఆర్థిక వృద్ధి రేటు పడిపోయిందని.. నాడు 8% ఉంటే  ఇప్పుడు 5.7%కు చేరిందని హరీశ్‌ చెప్పారు. కొత్త పరిశ్రమలు తెస్తామన్న బీజేపీ సర్కారు.. ఉన్న పరిశ్రమలను అమ్ముకుం టోందన్నారు. బీజేపీ ప్రభుత్వం అమ్మిన ప్రభుత్వ రంగ సంస్థల విలువ రూ. 3.5 లక్షల కోట్లని వివరించారు. బీజేపీ అధికారంలోకి రాక ముందు నిరుద్యోగం 4.7% ఉంటే ఏడేళ్ల పాలనలో  7.11 శాతానికి పెరిగిందన్నారు. బీజేపీ హయాంలో రైతుల ఆదాయం పెరగక పోగా ఖర్చులు పెరిగా యని విమర్శించారు. సంపద పెంచి పేదలకు పంచడం టీఆర్‌ఎస్‌ విధానం కాగా.. పేదలను దంచాలి పెద్దలకు పెంచాలన్నది బీజేపీ నినాదమన్నారు.
 

మరిన్ని వార్తలు