పవార్‌ కాకపోతే బలమైన రాష్ట్రపతి అభ్యర్థే లేడా?.. విపక్షాల తీరుపై శివసేన అసహనం

17 Jun, 2022 19:34 IST|Sakshi

ముంబై: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక కోసం విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ తరుణంలో శివసేన పార్టీ.. విపక్షాల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ఎన్నికలను ఇకనైనా సీరియస్‌గా తీసుకోవాలంటూ సూచించింది.

బలమైన రాష్ట్రపతినే ఎంపిక చేయడంలో తడబడితే.. రాబోయే రోజుల్లో ప్రధానికి సమర్థవంతమైన అభ్యర్థిని ఎలా ఎంపిక చేస్తారంటూ విపక్షాలకు శివసేన సూటి ప్రశ్న సంధించింది. ఈ మేరకు అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. పవార్‌ కాకపోతే.. ఇంకెవరు?. అభ్యర్థి విషయంలో కనీసం ఆరు నెలల ముందు నుంచైనా మంతనాలు జరపాల్సింది. ఇప్పుడు చర్చించడం వల్ల ఈ ఎన్నికలను తేలికగా తీసుకున్నారనే సంకేతాలను ప్రజల్లోకి పంపించినట్లయ్యింది. 

రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఇంత చర్చలు జరుపుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రధాని అభ్యర్థిగా.. అది సమర్థుడిని ఎలా నిలబెడతారు? అని ప్రజలు నిలదీసే అవకాశాలు ఉన్నాయి. గోపాకృష్ణగాంధీ, ఫరూఖ్‌ అబ్దుల్లా.. ఇలా రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎప్పటిలా వినిపించే పేర్లే ఈసారి వినిపిస్తున్నాయి. గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి ఎవరూ కనిపించడం లేదా అని విపక్షాలను పశ్నించింది శివసేన. 

అదే సమయంలో బలమైన అభ్యర్థి కోసం కేంద్రం కూడా పెద్దగా ఆలోచన చేయడం లేదని అనిపిస్తోంది. ఐదేళ్ల కిందట.. రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును ఇద్దరు ముగ్గురు మాత్రమే షార్ట్‌ లిస్ట్‌ చేశారు. ఈసారి కూడా అలాగే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి, ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని విపక్షాలకు సూచించింది శివసేన. 

మరిన్ని వార్తలు