-

‘డబుల్‌’ కాక

19 Sep, 2020 03:18 IST|Sakshi
మంఖాల్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పరిశీలిస్తున్న తలసాని, భట్టి, వీహెచ్‌

అధికార, ప్రతిపక్షాల మధ్య ఆగని సవాళ్లు 

నగరంలోనే లక్ష ఇళ్లు చూపించాలి: భట్టి విక్రమార్క  

శివారులో కట్టినా నగరవాసులకే: మంత్రి తలసాని  

రెండో రోజు అర్ధంతరంగా ముగిసిన పరిశీలన 

లక్డీకాపూల్‌/తుక్కుగూడ/రామచంద్రపురం (హైదరాబాద్‌): డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై అసెంబ్లీ సాక్షిగా అధికార, ప్రతిపక్షాల మధ్య మొదలైన సవాల్‌ వేడి మరింత రాజుకుంది. రెండో రోజు శుక్రవారం ఇళ్ల పరిశీలన సవాల్‌ ప్రతి సవాల్‌ మధ్య సాగింది. ‘చెప్పింది ఒకటి.. చూపింది ఒకట’ని ప్రతిపక్షం విమర్శించగా.. ‘జాబితా ఇస్తాం.. మీరే చూసుకోండి’ అంటూ అధికారపక్షం పేర్కొంది. చివరికి ఇళ్ల పరిశీలన సైతం అర్థాంతరంగా ముగిసింది. దీనిపై భట్టి పారిపోయారంటూ మంత్రులు ఎద్దేవా చేయగా, ప్రభుత్వమే పారిపోయిందంటూ భట్టి ఎదురుదాడి చేశారు. అంతకుముందు ఉదయం 9.30 గంటలకు రోడ్‌ నం.14లోని భట్టి నివాసానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ వెళ్లారు. అక్కడి నుంచి భట్టి, మాజీ ఎంపీ వి.హనుమంతరావుతో కలసి మంఖాల్‌లో నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలించారు. అనం తరం రాంపల్లిలో ఇళ్ల పరిశీలన కొనసాగుతుండగా కాంగ్రెస్‌ నాయకులు అర్ధంతరంగా విరమించుకొని వెనుదిరిగారు. ఆ తర్వాత కొల్లూరులో ఇళ్లను మంత్రులు తలసాని, మల్లారెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో మేయర్‌ బొంతు రామ్మోహన్, తెల్లాపూర్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మల్లెపల్లి లలితా సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

గ్రేటర్‌లో ‘లక్ష’ చూపించగలరా?: భట్టి 
గ్రేటర్‌ హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు చూపిస్తామని శాసనసభలో చెప్పిన మంత్రి వాటిని జీహెచ్‌ఎంసీలోనే చూపించగలరా అని భట్టి విక్రమార్క సవాల్‌ విసిరారు. రంగారెడ్డి జిల్లాలో నిర్మించిన ఇళ్లను చూపి ఇప్పటికే టీఆర్‌ఎస్‌ నాయకులు మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారని, త్వరలో జరిగే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లోనూ వీటినే చూపించి లబ్ధిపొందడానికి ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన మోసాలను గ్రేటర్‌ ప్రజలు గమనించాలన్నారు. హైదరాబాద్‌లో కట్టిన ‘డబుల్‌’ఇళ్లను చూపించలేక శివారుకు తీసుకెళ్లారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు తనకు 3,428 ఇళ్లు మాత్రమే చూపించారని చెప్పారు. మొత్తం ఇళ్లను చూపించమని అడిగితే జాబితా ఇస్తాం చూసుకోండంటూ అధికారపక్షం తప్పించుకు పారిపోయిందని భట్టి విమర్శించారు. 

జాబితా ఇస్తాం తనిఖీ చేసుకోండి
లక్ష ‘డబుల్‌’ఇళ్ల జాబితా ఇస్తామని, కాంగ్రెస్‌ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే వెళ్లి తనిఖీ చేసుకోవచ్చని మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మల్లారెడ్డి సవాల్‌ విసిరారు. కొల్లూరు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పరిశీలన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో చేసిన సవాల్‌ మేరకు స్వయంగా భట్టి విక్రమార్కను తీసుకెళ్లి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు చూపించామన్నారు. ఈ రోజు కూడా వాటిని చూపించేందుకు తీసుకెళ్లగా, భట్టి మధ్యలోనే వెళ్లిపోయారని తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా విలువైన భూముల్లో పేదలకు రెండు పడకల ఇళ్లు నిర్మిస్తున్నామని, వీటిలో ఆధునిక సదుపాయాలు సైతం కల్పిస్తున్నామని వివరించారు. కాంగ్రెస్‌ హయాంలో పేదలకు అగ్గిపెట్టెలాంటి ఇళ్లు నిర్మించారని, వాటిలోకి ఇప్పటివరకు ఎవరూ రాలేదని మంత్రులు విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్‌ విలువైన భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తుంటే కాంగ్రెస్‌ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఇళ్ల కేటాయింపులో రాజకీయ జోక్యం లేదన్నారు. వీటిని చూసి తట్టుకోలేకే భట్టి విక్రమార్క మధ్యలోనే వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. 

మరిన్ని వార్తలు