కేంద్రం కుట్రలను తిప్పికొడతాం: తలసాని 

21 Sep, 2020 05:34 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రైతాంగానికి అన్యాయం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు టీఆర్‌ఎస్‌ ఇతర పార్టీలతో కలిసి పోరాడుతుందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు, అలాగే విద్యుత్‌ సంస్కరణలతో రైతులకు నష్టం జరుగుతుందని, ఈ మేరకు పార్లమెంటులో పోరాడాలని సీఎం కేసీఆర్‌ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారని వివరించారు. ఆదివారం ఆయన పెద్దపల్లి జిల్లా పర్యటనకు వెళ్తూ కరీంనగర్‌లో మంత్రి గంగుల నివాసంలో కాసేపు ఆగారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో తీసుకొస్తున్న చట్టాలు ప్రజలను ఇబ్బందులపాలు  చేస్తున్నాయన్నారు. మోదీ ప్రభుత్వం తెచ్చే చట్టాలతో రైతుల సబ్సిడీలపై దెబ్బ పడుతుందన్నారు.  ఒకే దేశం, ఒకే పన్ను.. అని చెప్పి జీఎస్టీ తెస్తే ఇష్టం లేకున్నా ఆనాడు అందులో చేరామని, అయితే మూడేళ్లలో రూ.18 వేల కోట్ల నష్టం జరిగిందని తెలిపారు.  దేశంలో ఎక్కడైనా మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌ రూంలాంటి పథకాలున్నాయా అని తలసాని కాంగ్రెస్, బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఈ పథకాలతో సీఎం కేసీఆర్‌ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు