నిరూపిస్తే రాజీనామా చేస్తా.. తలసాని సవాల్‌

28 Feb, 2021 10:10 IST|Sakshi
ముషీరాబాద్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తలసాని

ఉద్యోగాల భర్తీపై ప్రతిపక్షాలకు మంత్రి తలసాని సవాల్‌ 

సాక్షి, కవాడిగూడ (హైదరాబాద్‌): తెలంగాణ ప్రభుత్వం ఈ ఆరేళ్లలో 1,33,999 ఉద్యోగాలను భర్తీ చేసిందని, ఇది అసత్యమని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకవేళ నిరూపించకపోతే రాజకీయ సన్యాసానికి సిద్ధమా అని మంత్రి సవాల్‌ విసిరారు. శనివారం భోలక్‌పూర్‌ డివిజన్‌లో హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి విజయాన్ని కాంక్షిస్తూ ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అధ్యక్షతన నిర్వహించిన టీఆర్‌ఎస్‌ సర్వసభ్య సమావేశానికి మంత్రి తలసాని హజరై మాట్లాడారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిందని, అది జరిగిందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఇంకా 50 వేల ఉద్యోగాల భర్తీకి సిద్ధంగా ఉందని తెలిపారు. ఉద్యోగాల భర్తీపై ఆర్టీఐ వద్ద సమాచారం ఉందని, అవసరమైతే ప్రతిపక్ష పార్టీలు వెళ్లి సమాచారం తెచ్చుకోవచ్చని సూచించారు. బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు నిరుద్యోగుల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. మతాన్ని అడ్డుపెట్టుకుని లబ్ధి పొందాలని బీజేపీ ప్రయతి్నస్తోందని, దీనిని ప్రజలు తిప్పికొట్టాలని సూచించారు. దేశంలో సర్వ మతాలను, కులాలను సమానంగా చూస్తుంది ఒక్క సెక్యులర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. ఈ 12 రోజలు ప్రతి కార్యకర్త నిరంతరం పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని, ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని పట్టభద్రుల ఓటర్ల ఇంటికి వెళ్లి వాణీదేవికి ఓటేయాలని కోరాలన్నారు. అత్యధిక మెజారీ్టని ముషీరాబాద్‌ నియోజకవర్గం అందిస్తుందని మంత్రి తలసాని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సలీం, టీఆర్‌ఎస్‌ నగర సీనీయర్‌ నాయకులు శ్రీనివాస్‌రావు, ముఠా జైసింహ, మాజీ కార్పొరేటర్లు వి.శ్రీనివాస్‌రెడ్డి, లాస్య నందిత, ముఠా పద్మ తదితరులు పాల్గొన్నారు. 

గొట్టంగాళ్లే కర్రుకాల్చి వాతపెడతారు: దాసోజు శ్రవణ్‌ 
సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల భర్తీపై చెబుతున్న లెక్కలు తప్పుగా ఉన్నాయని చెబితే తమను గొట్టంగాళ్లు అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అల్లాడిపోతున్నారని, గొట్టంగాళ్లే ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెడతారని తలసానికి చురకలంటించారు.

గాందీభవన్‌లో శనివారం యువజన కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్‌యాదవ్, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనరెడ్డి, అధికార ప్రతినిధులు ఇందిరాశోభన్, కల్వ సుజాత, మొగుళ్ల రాజిరెడ్డి, కాంగ్రెస్‌ ఫిషర్‌మెన్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ మెట్టు విజయ్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీపై చర్చకు రమ్మంటే తోకముడిచిన మంత్రి కేటీఆర్‌ తనను తలసానితో తిట్టించడం తగదని హితవు పలికారు. తలసాని ఓ బుద్ధిలేని సన్నాసి అని, తెలంగాణ ఉద్యమానికి అతడికి ఏం సంబంధంలేదని దాసోజు విరుచుకుపడ్డారు. ఏ ఎండకు ఆ గొడుకు పట్టే రాజకీయ భిక్షగాడు అని, చెంచాగిరీ చేసే తలసానికి నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హతలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కేటీఆర్‌ చెప్పినన్ని ఉద్యోగాలు ఇవ్వలేదన్న తన వాదనకు కట్టుబడి ఉన్నానని దాసోజు శ్రవణ్‌ స్పష్టం చేశారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిగిపోయే నాటికి 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యాయని, తాను చెప్పేది తప్పని గన్‌పార్క్‌ వద్దకు వచ్చి కేటీఆర్‌ నిరూపిస్తే అక్కడే గొంతుకోసుకుని చనిపోతానని శ్రవణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.   

మరిన్ని వార్తలు