గెలుపు సులువే: తలసాని 

22 Sep, 2020 06:27 IST|Sakshi

సాక్షి, కవాడిగూడ: త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్‌ ఓటరుగా నమోదయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి కార్పొరేటర్‌పై ఉందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సోమవారం లోయర్‌ ట్యాంక్‌ బండ్‌లోని పింగళి వెంకట్రామయ్య ఫంక్షన్‌ హాల్‌లో నగరానికి చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి కార్పొరేటర్‌ తమ తమ డివిజన్‌పరిధిలో ఉన్న గ్రాడ్యుయేట్‌లను గుర్తించి వారు ఓటరుగా నమోదు చేయించుకునే విధంగా కృషి  చేయాలని పిలుపునిచ్చారు.

విస్తృతంగా వర్షాలు కురుస్తున్నందున కార్పొరేటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని  సూచించారు. కరోనా మహమ్మారి నియంత్రణ కోసం లాక్‌ డౌన్‌ అమలు చేసిన సమయంలో ప్రతి కార్పొరేటర్‌ ఎంతో శ్రమించారని, ప్రజల ఇబ్బందులను గుర్తించి వారికి అండగా నిలిచారని ప్రశంసించారు. కార్పొరేటర్లు తమ డివిజన్లలోని పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, లేదా తన దృష్టికి తెచ్చినా అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.  

ఇంకా ఏమన్నారంటే.. 

  • రాబోయే ఎమ్మెల్సీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌ స్థాయి నుంచి అందరూ కృషి చేసి  తగిన విధంగా ప్రచారం చేస్తే  గెలుపు కష్టమేం కాదు. అందుకుగాను ప్రతి కార్పొరేటరూ కృషి చేయాలి.  ఇద్దరు ముగ్గురు కలిసి కమిటీలుగా ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలి. 
  • టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఎన్నెన్నో అభివృద్ధి పనులు జరిగాయి. వాటి గురించి ప్రజల్లోకి బాగా వెళ్లేలా ప్రచారం చేయాలి. తక్షణం మేలుచేయగల , ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాల గురించి వచ్చేనెల ఐదో తేదీలోగా  రాతపూర్వకంగా ఆయా విభాగాల వారీగా తెలియజేస్తే  సంబంధిత ప్రభుత్వశాఖల ద్వారా పనులు త్వరితంగా జరిగేలా చేస్తాం. 
  • టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఎన్నో పనులు చేశాం.  రానున్న మూడునెలలపాటు ముమ్మర ప్రచారం చేయాలి. ఇప్పటికే చేస్తున్నా, ఇంకా పెరగాలి. ముఖ్యమంత్రి, మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌ చేస్తున్న పనుల గురించి ఇప్పటికే ప్రజలకు తెలుసు. కార్పొరేటర్లు పూనుకుంటే 25 శాతం ఓట్లు అదనంగా వస్తాయి. కాంగ్రెస్‌ ప్రజల కోసం చేసిందేమీ లేదు. ఇక బీజేపీ దేశభక్తి పేరిట ఎన్నికల లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుంది.అవేవీ దీర్ఘకాలంలో పనిచేయవు. టీఆర్‌ఎస్‌ ఆరేళ్లలో నగరంలో చేసిన అభివృద్ధి పనులతోనే మనం ఈజీగా గెలవగలం.
  • సమావేశంలో మంత్రులు  మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు  ప్రభాకర్, జనార్ధన్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, గాంధీ, సాయన్న, మేయర్‌ బొంతు రామ్మోహన్,  డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

ఎన్నికల కసరత్తు షురూ
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ సమాయత్తమవుతోంది. కరోనాతో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించాలా లేక ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్ల (ఈవీఎం)ల ద్వారా నిర్వహించాలా ..అన్న అంశంపై అభిప్రాయం చెప్పాలని ప్రధాన రాజకీయ పక్షాలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి సోమవారం లేఖలు రాశారు. ఈ నెలాఖరులోపు తమ అభిప్రాయాన్ని చెబితే.. మెజారిటీ అభిప్రాయం మేరకు ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అన్ని ఎన్నికలు ఇప్పటి వరకు బ్యాలెట్‌ పద్ధతినే నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నందున పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నిర్వహించే యోచనలో ఉన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా