'మాకు నిజాయతీ ఉంది.. చూసే వాళ్లకూ ఉండాలి'

18 Sep, 2020 10:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొద్దిసేపటి క్రితమే మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంటికి చేరుకున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రభుత్వం నిర్మించిన లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్లను పరిశీలించే క్రమంలో భాగంగానే శుక్రవారం మరోమారు భట్టి ఇంటికి మంత్రి తలసాని వచ్చారు. కాసేపట్లో ఇరువురు కలిసి కొల్లూరు, కుత్బుల్లాపూర్‌, జవహర్‌నగర్‌, రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌లో పర్యటించి డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను పరిశీలించనున్నారు.  

ఈ సందర్భంగా మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. 'భట్టి ఇంటికి వచ్చాము. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చూపిస్తున్నాం. దళారులకు డబ్బులు ఇస్తే మోసపోతారు. ప్రభుత్వం పద్ధతి ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేస్తుంది. ఇళ్ల కేటాయింపుపై లబ్ధిదారులు అడుగుతారు. ఈ రోజు వెళ్లి చూపిస్తాం. రేపటి నుంచి ఆయా ప్రాంతాల్లో అధికారులు వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు చూపిస్తారు. ఇవి మున్సిపల్ ఎన్నికల కోసం కట్టే ఇళ్లు కావు. ఒక్క డబుల్ బెడ్‌రూమ్‌ ఇల్లే కాదు.. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిని చూపిస్తాం. లాక్‌డౌన్ సమయంలో రోడ్లు వేశాము. వర్షం పడితే నీళ్లు రాకుంటే.. నిప్పు వస్తదా..?. అభివృద్ధిని చూపించే దమ్ము, ధైర్యం మాకున్నాయి. మాకు నిజాయితీ ఉంది. చూసే వాళ్లకు కూడా నిజాయితీ ఉండాలి' అని మంత్రి తలసాని వివరించారు.  (బస్తీమే.. సవాల్‌!)

తలసాని వ్యాఖ్యలపై సీఎల్పీ నేత భట్టి స్పందిస్తూ.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను చూపిస్తాం అన్నారు. జీహెచ్‌ఎంసీలో కట్టిన ఇళ్లను మాత్రమే చూపించాలి. అలా కాకుండా గ్రేటర్‌ బయట కటట్టిన ఇళ్లను చూపిస్తే ఎలా అంటూ' భట్టి ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు