ప్రధాన పోటీ ఆ రెండింటి మధ్యే; ఆ ముగ్గురు ఫెయిల్‌!

3 May, 2021 09:01 IST|Sakshi

ముగ్గురికీ దక్కని ‘మూడో’ కుర్చీ 

కూటమి సారథులు ముగ్గురూ ఓటమిపాలు 

ప్రత్యామ్నాయ ప్రయోగం నాల్గోసారి విఫలం

సమీకరణాలు మారినా దక్కని ఫలితం

పార్టీ స్థాపన తరువాత కమల్, దినకరన్‌ ఎదుర్కొన్న తొలి అసెంబ్లీ ఎన్నికలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలోనే తమిళనాడు ఎన్నికలు ప్రత్యేకం. బరిలో ఎన్నిపార్టీలున్నా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యనే ప్రధాన పోటీ. అధికారంలోకి వచ్చేది ఆ రెండింటిలో ఒకటి అనేది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఎటొచ్చి ఎప్పటికప్పుడు మారేది ఏ పార్టీది మూడో స్థానం అనే. అయితే ఈసారి కూడా ఎప్పటి లాగానే ప్రత్యామ్నాయ ప్రయోగం మరోసారి విఫలమైంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే అగ్రనేత కరుణానిధి మరణం తర్వాత వచ్చిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పూర్వస్థితే కొనసాగడం, మూడో కూటమి నాల్గోసారి మునిగిపోవడం గమనార్హం. 

తమిళనాడులో కాంగ్రెస్‌ పతనమైన తర్వాత ద్రవిడ పార్టీలే ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. డీఎంకే లేదా అదే పార్టీ నుంచి పుట్టుకొచ్చిన అన్నాడీఎంకే మధ్యనే ప్రధాన పోటీ పరిపాటిగా మారింది. ఆ రెండు కూటములంటే గిట్టని బలమైన ఓటు బ్యాంకు ఒకటుందని విశ్వసిస్తూ గతంలో మూడుసార్లు మూడో కూటమి యత్నాలు జరిగాయి. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్‌ మరణం తరువాత 1988లో అప్పటి తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షులు జీకే మూప్పనార్‌ నేతృత్వంలో ఏర్పడిన మూడో కూటమి 26 సీట్లు, 20 శాతం ఓట్లు సాధించింది. 1996లో డీఎంకే నుంచి బయటకు వచ్చిన వైగో.. ఎండీఎంకేను స్థాపించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా వామపక్ష పార్టీలతో కలిపి మూడో కూటమి ఏర్పాటు చేశారు. 

యథాప్రకారం ఇదీ విఫలమైంది. 2006 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నటుడు విజయకాంత్‌ డీఎండీకేను స్థాపించి అన్ని స్థానాల్లో పోటీచేసినా తానొక్కడే గెలిచాడు. 2011 ఎన్నికల్లో డీఎంకే 23 స్థానాలకే పరిమితం కాగా, అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్న డీఎండీకే 29 స్థానాల్లో గెలిచి మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఆ తరువాత జయలలితతో విబేధించిన విజయకాంత్‌ విపక్షాలతో చేతులు కలిపాడు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో వైగో (ఎండీఎంకే) డీఎండీకే, వామపక్ష పార్టీలు, వీసీకే, తమకా పార్టీలతో కలిసి మరోసారి ‘ప్రజా సంక్షేమ కూటమి’పేరున ఏర్పడిన మూడో కూటమి కనీసం ఒక్క సీటూ గెలవలేక చేదు అనుభవాన్నే చవిచూసింది.

మూడో కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్దిగా బరిలోకి దిగిన విజయకాంత్‌ సహా దాదాపుగా అందరూ జయలలిత ధాటికి డిపాజిట్లు కోల్పోయారు. మూడో కూటమి యత్నం ముచ్చటగా మూడుసార్లు విఫలమైనా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరో ప్రయత్నం జరుగింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన మేజిక్‌ ఫిగర్‌ 80–90 శాతం స్థానాలను తమకు ఉంచుకుని మిగిలినవి మిత్రపక్షాలకు కేటాయించడాన్ని అన్నాడీఎంకే, డీఎంకే అనుసరిస్తున్నాయి. దీంతో కొన్ని పార్టీలు గత్యంతరం లేక సర్దుకుపోతుండగా, మరికొన్ని మూడో కూటమివైపు వచ్చేయడం జరుగుతోంది. సర్దుబాటు పరిస్థితి చిన్నపార్టీలకే కాదు, కాంగ్రెస్, బీజేపీ వంటి పెద్దపార్టీలకూ తప్పడం లేదు.  

ఇక తాజా విషయానికి వస్తే డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్‌ 25, అన్నాడీఎంకే కూటమి నుంచి బీజేపీ 20 సీట్లు పొందాయి. ఈ రెండు జాతీయ పార్టీలకూ తమిళనాడులో పెద్ద బలం, బలగం లేదు. ఆశించిన స్థాయిలో సీట్లు దక్కినా దక్కకున్నా ఆయా కూటముల్లో కొనసాగక తప్పలేదు. అన్నాడీఎంకే కూటమిలోని సమత్తువ మక్కల్‌ కట్చి అధ్యక్షులు, నటుడు శరత్‌కుమార్‌ పార్టీ గుర్తు, పరిమిత సీట్ల కేటాయింపును నచ్చకే మూడో కూటమి ఐజేకేలో చేరారు. మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షులు కమల్‌హాసన్‌ ఐజేకే కూటమిలో చేరి సీఎం అభ్యర్దిగా బరిలో నిలిచారు. అన్నాడీఎంకే కూటమిలో ఉండిన డీఎండీకే టీటీవీ దినకరన్‌ పంచన చేరింది. రాజకీయ సమీకరణలు మారినా అన్నాడీఎంకే, డీఎంకే ప్రత్యామ్నాయ ప్రయోగం నాల్గోసారి నగుబాటుగా మిగిలిపోయింది.    

పంచముఖ పోటీ
తమిళనాట తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పంచముఖ పోటీ నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకేతోపాటు మక్కల్‌ నీది మయ్యం (కమల్‌హాసన్‌), అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం (టీటీవీ దినకరన్‌), నామ్‌ తమిళర్‌ కట్చి (సీమాన్‌) ఐదు కూటములకు సారథ్యం వహించాయి. అన్ని కూటముల సారథులు ముఖ్యమంత్రి అభ్యర్థులుగానే బరిలోకి దిగారు. పార్టీ పెట్టిన తరువాత కమల్‌హాసన్, టీటీవీ దినకరన్‌లు ఎదుర్కొన్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. అధికారంలోకి వచ్చేది డీఎంకే లేదా అన్నాడీఎంకే అనేది ఎన్నికలకు ముందే స్పష్టమై పోవడంతో మూడోస్థానం ఎవరిది అనేది చర్చనీయాంశమైంది. 

2016లో పార్టీ స్థాపించిన సీమాన్‌ అప్పటి ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఒంటరి పోటీకి దిగి ఒక్కస్థానం కూడా గెలవకున్నా 1.07 శాతం ఓట్లు సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో కమల్‌ తన సినీ ఆకర్షణను జోడించి మూడో ప్రత్యామ్నాయంగానే ప్రచారం చేసుకున్నాడు. అన్నాడీఎంకే అసంతృప్తవాదులను టీటీవీ దినకరన్‌ నమ్ముకున్నారు. శ్రీలంక ఈలం తమిళం, మాతృ (తమిళ) భాషాభిమానిగా సీమాన్‌ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. సీమాన్‌కు యువత ఆదరణ ఒకింత ఉంది. అయితే ఓటమి పాలైన ముగ్గురు ముఖ్యమంత్రులు తమ కూటమి అభ్యర్థులను గెలిపించుకోలేక పోయినా, ఎంతవరకు ఓట్ల శాతం సాధించిపెట్టారనేది పూర్తి గణాంకాలు వచ్చాక తేలనుంది. 

చదవండి: తమిళనాడు: కమలనాథుల జేబులో కీలక సీటు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు