తమిళనాడు ఎన్నికలు; కాంగ్రెస్‌కు అధిక సీట్లిస్తే గల్లంతే!

27 Feb, 2021 13:24 IST|Sakshi

గత అనుభవంతో డీఎంకే జాగ్రత్తలు 

40 సీట్లు కోరుతున్న కాంగ్రెస్‌  పార్టీ

20 సీట్లతో సర్దుకోక తప్పదంటున్న డీఎంకే 

సాక్షి ప్రతినిధి, చెన్నై: తాజా ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకుని ఎలాగైనా అధికార పీఠం ఎక్కాలని పట్టుదలతో ఉన్న డీఎంకేకి మిత్రపక్షాల సీట్ల సర్దుబాటు సమస్యగా మారింది. అయితే రాజీలేని ధోరణితో ముందుకు సాగడమే శ్రేయస్కరమని తీర్మానించుకుంది. 40 సీట్లు కోరుతున్న కాంగెస్‌కు 20 సీట్లతో కళ్లెం వేయడమే మేలు, గత ఎన్నికల్లోలా మళ్లీ అధికారం చేజార్చుకోలేమని డీఎంకే స్పష్టీకరణతో తొలివిడత సీట్ల సర్దుబాటు చర్చలు ఒక కొలిక్కి రాకుండానే వాయిదా పడ్డాయి. 

తమిళనాడులో 2011, 2016 ఎన్నికల్లో వరుసగా అన్నాడీఎంకేనే అధికారంలో రావడంతో దశాబ్దకాలంగా డీఎంకే ప్రతిపక్షంగా సర్దుకుపోక తప్పలేదు. ప్రజాకర్షణ కలిగిన నేత కరుణానిధి కన్నుమూసిన తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన స్టాలిన్‌ తొలిసారిగా ఎదుర్కొంటున్న అసెంబ్లీ ఎన్నికలు ఇవి. సీఎం కావాలనే తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు స్టాలిన్‌ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ‘మీ నియోజకవర్గంలో స్టాలిన్‌’ పేరున రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో కోటి కుటుంబాల సమస్యలు పరిష్కరిస్తా నంటూ గతంలో ఎన్నడూ ఎరుగని హామీలు గుప్పిస్తున్నారు. అన్నాడీఎంకే, బీజేపీలను ప్రధాన ప్రత్యర్థులుగా భావిస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ తమిళభాష, సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకమని, ఇలాంటి కేంద్రప్రభుత్వానికి అన్నాడీఎంకే ప్రభుత్వం దాసోహమై పోయిందని ప్రచారం చేస్తూ సెంటిమెంట్‌తో దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రుల అవినీతి చిట్టాను గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌కు సమర్పించడం ద్వారా అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసే ప్రయత్నం కూడా చేశారు. 

ఇదిలాఉండగా, స్టాలిన్‌కు స్వయానా సోదరుడైన అళగిరి దక్షిణ తమిళనాడులో ఓటర్లను ప్రభావితం చేయగల నేతగా ఉన్నారు. తండ్రి కరుణానిధికి కల్లబొల్లి మాటలు చెప్పి పార్టీ నుంచి వెళ్లగొట్టించాడని స్టాలిన్‌పై అగ్రహంతో ఉన్న అళగిరి డీఎంకే ఓటమిని కోరుకుంటున్నారు. తమ ప్రధాన ప్రత్యర్థి అన్నాడీఎంకే గెలుపు అవకాశాలను శశికళ నీరు గార్చగలరని స్టాలిన్‌ ఆశిస్తున్నా, ఇప్పటి వరకు శశికళ జోరు అంతగా లేదు. అన్న అళగిరి సర్దుకుపోవడం, రాజకీయంగా శశికళ రెచ్చిపోవడం అంటూ జరిగితే డీఎంకే గెలుపు నల్లేరుపై నడకగా మారగలదని స్టాలిన్‌ విశ్వసిస్తున్నారు. 

డీఎంకే 190.. 
తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుండగా 190 స్థానాల్లో డీఎంకే పోటీచేయాలని, మిగిలిన 44 స్థానాలను కూటమిలోని కాంగ్రెస్, వైగో నాయకత్వంలోని ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం, వీసీకే, కొంగునాడు దేశీయ మక్కల్‌ కట్చి, మనిదనేయ మక్కల్‌ కట్చి, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ వంటి మిత్రపక్ష పార్టీలకు సర్దాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాజా ఎన్నికల్లో 190 స్థానాల్లో పోటీ చేసి కనీసం 117 గెలుచుకోవడం ద్వారా అధికారం చేపట్టాలని డీఎంకే పట్టుదలగా ఉంది. 2011 ఎన్నికల్లో 119 సీట్లలో పోటీ చేసిన డీఎంకే కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుని అధికారాన్ని కోల్పోయింది. 2016 ఎన్నికల్లో 178 స్థానాల్లో పోటీ చేసి 89 చోట్ల గెలిచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికసీట్ల కేటాయింపుతో డీఎంకేకు అధికారం దూరమయింది. 

2016 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 41 సీట్లలో పోటీచేసి 8 చోట్ల మాత్రమే గెలిచింది. డీఎంకే 89 సీట్లు సాధించింది. 117 సీట్లలో గెలుపొందడం ద్వారా అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. స్వల్పతేడాతో అధికారం చేజారడానికి కాంగ్రెస్సే కారణమని డీఎంకే ఆనాటి నుంచి ఆ పార్టీపై గుర్రుగా ఉంది. తాజా ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో ఆచితూచి అడుగేయాలని డీఎంకే నిర్ణయించుకుంది. డీఎంకే–కాంగ్రెస్‌ మధ్య సీట్ల సర్దుబాటుపై తొలి విడత చర్చలు ఈనెల 25న ప్రారంభమయ్యాయి. 

ఈసారి ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ 41 వరకు సీట్లు కోరడంతో డీఎంకే సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. ప్రజల మద్దతు లేని కాంగ్రెస్‌కు అధికసీట్లు కేటాయించడం ద్వారా మరోసారి అధికారాన్ని చేజార్చుకునేందుకు సిద్ధంగా లేమని డీఎంకే స్పష్టం చేసింది. 15 సీట్లు కేటాయించాలని భావించాం, తుది నిర్ణయంగా 18 సీట్లకు మించి ఇచ్చేది లేదని డీఎంకే తేల్చిచెప్పడంతో కాంగ్రెస్‌ నిరాకరించింది. సుమారు గంటపాటు సాగిన చర్చలు ఎంతకూ కొలిక్కి రాకపోవడంతో మరోసారి బేటీ కావాలని ఇరువర్గాలు నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్‌కు గరిష్టంగా 20 సీట్లు, మిగిలిన మిత్రపక్షాలకు తలా రెండు సీట్లు కేటాయించాలని డీఎంకే తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇంతకంటే అదనంగా సీట్ల కోసం ఆయా పార్టీలు పట్టుబట్టే అవకాశం ఉంది.   

చదవండి: 
వెనక్కి తగ్గని శశికళ: ఆమె ఇంటికి సినీ ప్రముఖుల క్యూ

రజనీ.. రండి కలిసి పనిచేద్దాం: కమల్‌ 

మరిన్ని వార్తలు