కోటీశ్వరుల్లో నంబర్‌–1 సుబ్బయ్య

18 Mar, 2021 19:12 IST|Sakshi
ఇసక్కి సుబ్బయ్య

సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరిలో అత్యంత ధనవంతుడిగా అన్నాడీఎంకే అభ్యర్థి ఇసక్కి సుబ్బయ్య నిలిచారు. ఆయన ఆస్తి రూ. 246 కోట్లుగా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ల సమర్పణలో నిమగ్నమయ్యారు. ఇందులో మంత్రులు, మాజీలు, సిట్టింగ్‌లు అనేక మంది ఉన్నారు. వీరందరి ఆస్తులు కోట్లలోనే ఉన్నాయి. అయితే, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమలహాసన్, ఉపాధ్యక్షుడు మహేంద్రన్‌ ఆస్తులు మూడు డిజిట్‌ కోట్లలో ఉన్నాయి. కమలహాసన్‌ ఆస్తి రూ.177 కోట్లుగా, మహేంద్రన్‌ ఆస్తి 160 కోట్లుగా ఉన్నాయి.

వీరందర్నీ తలదన్నే రీతిలో కోటీశ్వరుల జాబితాలో అన్నాడీఎంకే మాజీ మంత్రి ఇసక్కి సుబ్బయ్య నంబర్‌వన్‌గా నిలిచారు. 2011లో ఆయన ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఆస్తి విలువ రూ.60 కోట్లు. ఆ తర్వాత న్యాయశాఖమంత్రిగా పనిచేసినా 2016 ఎన్నికల్లో సీటు దక్కలేదు. తాజాగా ఆయనకు తిరునల్వేలి జిల్లా అంబాసముద్రం నియోజకవర్గం నుంచి పోటీ చేసే  అవకాశం దక్కింది. దీంతో బుధవారం ఆ నియోజకవర్గంలో ఇసక్కి సుబ్బయ్య నామినేషన్‌ వేశారు.

ఈ అఫిడవిట్‌లో తన ఆస్తి విలువ రూ. 246 కోట్లుగా ప్రకటించారు. తనతో పాటు భార్య మీనాక్షి పేరిట చర ఆస్తులు రూ. 6.86 కోట్లు అని, స్థిర ఆస్తులు రూ. 239 కోట్లు అని లెక్కచూపించారు. అప్పులు రూ. 5 కోట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో ఇసక్కి సుబ్బయ్య ఆస్తి నాలుగు రెట్లు పెరగడం గమనార్హం. చెన్నై అన్నానగర్‌లో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి ఎంకే మోహన్‌ రెండో స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తి విలువ రూ.211 కోట్లుగా ప్రకటించారు.  

చదవండి:

స్టాలిన్ మొత్తం ఆస్తుల విలువ ఇంతేనా

పది చదవని హీరో కమల్‌హాసన్‌ ఆస్తులు ఎంతో తెలుసా..?

మరిన్ని వార్తలు