అసెంబ్లీ ఎన్నికలు: చరిత్ర పునరావృతమే!

27 Mar, 2021 14:16 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం. అది అసాధ్యమని తేలితే కనీసం ప్రత్యర్థి గెలుపు అవకాశాలు దెబ్బతీయాలని అభ్యర్థులు ఆశించడం రాజకీయాల్లో సహజం. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకే కూటముల విజయావకాశాలను దెబ్బతీయడం కోసమే అన్నట్లుగా కొన్ని పార్టీలు రంగంలో ఉన్నాయి. ఈ పార్టీలు ఏ కూటమికి కంటకంగా మారాయి, ఏ అభ్యర్థి గెలుపును ఎంత వరకు దెబ్బతీస్తాయని విశ్లేషించుకోక తప్పదు. 

అప్పుడు కాంగ్రెస్‌ హవా
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం (తమిళనాడు)లో 1952, 1957, 1962 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ వరుసగా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించినా ఆ దూకుడుకు డీఎంకే అడ్డుకట్టవేసింది. 1967లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెస్‌ను ఓడించి డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఇక ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఒంటరిగా తల ఎత్తుకు తిరిగే పరిస్థితినే కోల్పోయేలా చేసిన ఘనత డీఎంకేకు మాత్రమే దక్కుతుంది. 1967 నాటి డీఎంకే చారిత్రాత్మక గెలుపుతో అన్నాదురై ముఖ్యమంత్రి అయ్యారు.

కరుణానిధి- ఎంజీ రామచంద్రన్‌ మధ్య విభేదాలు
అన్నాదురై మరణం తరువాత 1971లో వచ్చిన ఎన్నికల్లో సైతం డీఎంకే ఘనవిజయం సాధించగా ఆపార్టీ అధ్యక్షులు కరుణానిధి సీఎం పీఠం అధిరోహించారు. కరుణానిధితో అభిప్రాయబేధాలు వచ్చి పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎంజీ రామచంద్రన్‌ 1972 అక్టోబర్‌ 17న అన్నాడీఎంకేను స్థాపించారు. 1977లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఎంజీఆర్‌ విజయపరంపర 1980, 1984 ఎన్నికల్లో సైతం కొనసాగింది. తన 70 ఏళ్ల వయసులో 1987 డిసెంబర్‌ 24వ తేదీన ఎంజీఆర్‌ కన్నుమూసిన తరువాత పార్టీ చీలిపోగా, 1989 ఎన్నికల్లో డీఎంకే మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఎంజీఆర్‌ కన్నుమూసిన తరువాత జయలలిత పార్టీ పగ్గాలు చేపట్టి కరుణానిధిని గట్టిగా ఢీకొట్టడం ప్రారంభించారు.

1991- 2016 వరకు వారిద్దరే
1991లో జయలలిత, 1996లో కరుణానిధి, 2001లో జయలలిత, 2006లో కరుణానిధి, 2011లో జయలలిత ఒకరు సీఎం అవుతూ వచ్చారు. అయితే 2016లో వచ్చిన ఎన్నికల్లో జయలలిత వరుసగా రెండోసారి గెలుపొంది అనాధిగా వస్తున్న ఆనవాయితీకి అడ్డుకట్ట వేశారు. ఎంజీఆర్‌ జీవించి ఉన్నత వరకు అధికారానికి దూరంగా ఉండక తప్పనిపరిస్థితిని ఎదుర్కొన్న డీఎంకే ఆ తర్వాత మాత్రమే గెలుపు బాటలోకి ప్రయాణించడం ప్రారంభించింది. ఎంజీఆర్‌తో సమానంగా జయలలిత కూడా కరుణకు పోటీగా నిలిచారు.

ఇక రాజకీయాల్లో బలశాలులైన జయ, కరుణ ఇద్దరూ కన్నుమూసిన తర్వాత ఆ రెండు పార్టీలు తొలి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. తమిళనాడులో 1952 నుంచి ఇప్పటి వరకు 15 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలన్నీ అనేక ప్రత్యేక ప్రాతిపధికలతో పోటీకి దిగి విజయం సాధించాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మూడో పార్టీకి అవకాశం లేకుండా పోయింది. ఎంజీఆర్‌ మరణం తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే జయలలిత వర్గం, జానకి వర్గంగా విడిపోయింది.

ఈ సమయంలో తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులుగా ఉండిన జీకే మూపనార్‌ మూడో కూటమిని ఏర్పాటు చేశారు. అయినా, ఆనాటి ఎన్నికల్లో డీఎంకేనే విజయం సాధించింది. 1996లో డీఎంకే నుంచి విడిపోయిన వైగో ఎండీఎంకేను స్థాపించి మూడో అతిపెద్ద పార్టీగా మార్చే ప్రయత్నం చేశారు. అదే ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి విడిపోయిన జీకే మూపనార్‌ తమిళ మానిల కాంగ్రెస్‌ పార్టీని ప్రారంభించి డీఎంకేతో కూటమిగా ఏర్పడ్డారు. రజనీకాంత్‌ పరోక్ష మద్దతుతో ఈ కూటమి అప్పటి ఎన్నికల్లో విజయం సాధించింది.

మూడో అతిపెద్ద పార్టీగా ఏర్పడాలనే లక్ష్యంతో
అన్నాడీఎంకే, డీఎంకే తరువాత మూడో అతిపెద్ద పార్టీగా ఏర్పడాలనే లక్ష్యంతో నటుడు విజయకాంత్‌ డీఎండీకేను స్థాపించి తొలి ఎన్నికల్లో తాను మాత్రమే గెలుపొందారు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకున్నారు. అయితే ఆ తరువాత అమ్మతో విభేదించగా, 2016 ఎన్నికల్లో విజయ్‌కాంత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టి వైగో నాయకత్వంలో ఏర్పడిన ప్రజాసంక్షేమ కూటమి ఘోర ఓటమి చవిచూసింది. ఇలా రాష్ట్ర రాజకీయల చరిత్రలో అన్నాడీఎంకే, డీఎంకే ఢీకొనే ఏ కూటమి మనుగడ సాగించలేదు. 

అధికారంలో ఆ రెండింటిలో ఒకటే..
ఇదిలా ఉండగా, 1967 నుంచి 2016 వరకు వచ్చిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే మధ్యనే ప్రధాన పోటీ ఉంటోంది. తాజా ఎన్నికలోల్ సైతం అదే పరిస్థితి కొనసాగుతోంది. అన్నాడీఎంకే, డీఎంకే రెండు కూటములకు పోటీగా మరో మూడు కూటములు ఏర్పడ్డాయి. ఐజేకే నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్‌ హాసన్‌, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ సైతం ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇక నామ్‌ తమిళర్‌ కట్చి అధ్యక్షుడు సీమాన్‌ మరో కూటమి ఏర్పాటు చేసుకున్నారు.

కాగా, కమల్‌ కూటమి ఒంటరిగా ఎదుర్కొంటున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. సీమాన్‌కు రెండో అనుభవం. ఈ మూడు కూటములు అన్నాడీఎంకే, డీఎంకే కూటముల ఓట్లను చీల్చడం ద్వారానే గెలుపు బాటలో ప్రయాణిస్తామని విశ్వసిస్తున్నాయి. అన్నాడీఎంకే ఓటు బ్యాంకుపై దినకరన్‌ గురిపెట్టారు. అన్నాడీఎంకే, డీఎంకేకు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూసే ఓటర్లను కమల్‌, సీమాన్‌ నమ్ముకున్నారు. కొత్తగా బరిలో ఉన్న కూటముల అభ్యర్థుల గెలుపు సంగతి అటుంచితే ప్రత్యర్థుల ఓట్లను చీల్చి మెజార్టీ లేదా గెలుపు అవకాశాలకు గండికొట్టడం ఖాయమని భావించవచ్చు.

చదవండి: సీఎంని స్టాలిన్‌ చెప్పుతో పోల్చిన నాయకుడు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు