చివరి క్షణంలో ఎన్నికల నుంచి వైదొలగిన రజనీ సన్నిహితుడు

18 Mar, 2021 08:45 IST|Sakshi

అర్జునమూర్తి యూటర్న్‌

సాక్షి, చెన్నై: పార్టీ ప్రకటించినా, మేనిఫెస్టో విడుదల చేసినా, 234 స్థానాల్లో ఒంటరి సమరం అన్న నిర్ణయం తీసుకున్నా, చివరి క్షణంలో ఎన్నికల నుంచి వైదొలుగుతున్నట్టు తలైవా రజనీకాంత్‌ సన్నిహితుడు అర్జునమూర్తి బుధవారం చెన్నైలో ప్రకటించారు. తాను ప్రకటించనున్న పార్టీకి సమన్వయకర్తగా అర్జునమూర్తిని రజనీకాంత్‌ నియమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిణామాలతో అనారోగ్య కారణాలతో పార్టీ పెట్టడం లేదని, రాజకీయాలకు ఇక దూరమని రజనీకాంత్‌ ప్రకటించారు. దీంతో గత నెల అర్జునమూర్తి సొంత పార్టీగా ఇండియా మక్కల్‌ మున్నేట్ర కట్చిని  ప్రకటించుకున్నారు. ఈ పార్టీకి ఎన్నికల కమిషన్‌ రోబో చిహ్నం కేటాయించింది. దీంతో గతవారం ఎన్నికల మేనిఫెస్టోను సైతం అర్జున మూర్తి విడుదల చేశారు. 234 స్థానాల్లోనూ తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు.

వివిధ పార్టీల్లోకి వెళ్తున్న రజనీకాంత్‌ అభిమానులు తన వైపు రావాలని పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారంతో నామినేషన్ల గడవు ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటిస్తారనుకున్న అర్జునమూర్తి బుధవారం ఓ ప్రకటన చేశారు. అందులో తాను ఎన్నికల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. తన పార్టీకి ప్రచారంగా సిద్ధం చేస్తున్న రోబో ఇక్కడకు రావడానికి మరింత సమయం పడుతుందని వివరణ ఇచ్చారు. కరోనా వ్యాప్తి పెరుగు తుండడంతో మద్దతుదారుల ఆరోగ్య క్షేమాన్ని కాంక్షించి పోటీ చేయడం లేదని ప్రకటించారు. రజనీ పార్టీ ప్రకటన ముందే యూటర్న్‌ తీసుకుంటే, ఆయన సన్నిహితుడు పార్టీ ప్రకటించి, మేనిఫెస్టో విడుదల చేసి, ఎన్నికల కమిషన్‌ కేటాయించిన రోబో చిహ్నాన్ని భుజానకెత్తుకుని నామినేషన్ల చివరి క్షణంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

చదవండి: అసెంబ్లీ ఎన్నికల బరిలో విజయకాంత్‌ సతీమణి

మరిన్ని వార్తలు