అసెంబ్లీ ఎన్నికల బరిలో విజయకాంత్‌ సతీమణి

17 Mar, 2021 19:34 IST|Sakshi

సాక్షి, చెన్నై: డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్‌ విరుదాచలం నుంచి పోటీ చేయనున్నారు. భర్త, పార్టీ అధినేత విజయకాంత్‌ ప్రప్రథమంగా గెలిచిన నియోజకవర్గం ఇదే కావడం గమనార్హం. ఈ సారి ఎన్నికల్లో విజయకాంత్‌  పోటీ చేయడం లేదు. అన్నాడీఎంకేతో జతకట్టేందుకు ప్రయత్నించి చివరకు అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగంతో సర్దుకోవాల్సిన పరిస్థితి విజయకాంత్‌ నేతృత్వంలోని డీఎండీకేకు  ఎదురైన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో నీవే సీఎం అభ్యర్థి అంటూ, ప్రజాకూటమికి సారథ్యం వహించాలని అనేక పార్టీలు విజయకాంత్‌ చుట్టూ తిరిగాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారడంతో ఈ సారి పొత్తుకోసం డీఎండీకే  కుస్తీలు పట్టక తప్పలేదు. ఎట్టకేలకు అమ్మముక ఇచ్చిన 60 సీట్లలో పోటీకి డీఎండీకే సిద్ధమైంది. 2006 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న విజయకాంత్‌ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.

అనారోగ్య సమస్యల దృష్ట్యా, ఆయన పోటీ చేయనప్పటికీ, చివరి క్షణంలో ప్రచారంలోకి రాబోతున్నారు. ఆయన తరఫున ప్రేమలత విజయకాంత్‌ ప్రప్రథమంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. 2005లో డీఎండీకే ఆవిర్భావంతో ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి విజయకాంత్‌ ఒక్కడే విరుదాచలం నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కారు. ప్రస్తుతం ఇదే విరుదాచలంను ప్రేమలత ఎంపిక చేసుకున్నారు. విరుదాచలం ప్రగతికి విజయకాంత్‌ గతంలో చేసిన సేవలు, అక్కడ ఆయనకు ఉన్న అభిమానాన్ని పరిగణించి ప్రేమలత ఓట్ల వేటకు సిద్ధమయ్యారు. ఈనెల 19న చివరి రోజు నామినేషన్‌ దాఖలుకు నిర్ణయించారు.  మంగళవారం ప్రేమలత మాట్లాడుతూ విరుదాచలం నుంచి తాను పోటీ చేయనున్నానని, తమ కూటమి విజయకేతనం ఎగురవేయడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. విజయకాంత్‌ చివరి క్షణంలో ఎన్నికల ప్రచారంలోకి వస్తారని, ఆ వివరాలను మరి కొద్దిరోజుల్లో ప్రకటిస్తామన్నారు.

చదవండి: సర్వేలన్నీ ఆ పార్టీ వైపే : 161 నుంచి 169 స్థానాలు! 

మరిన్ని వార్తలు