అసెంబ్లీ ఎన్నికలు: ‘కాంగ్రెస్’‌లో వారసుల పోటీ!

15 Mar, 2021 10:42 IST|Sakshi

నలుగురికి అసెంబ్లీ, ఒకరికి లోక్‌సభ సీటు

సాక్షి, చెన్నై: తమిళనాడు కాంగ్రెస్‌లోకి వారసులొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ వారసులను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దించారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌కు  25 సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను తమిళనాడు కాంగ్రెస్‌ నేతలు సిద్ధం చేసి శుక్రవారం ఢిల్లీకి పంపించారు. గ్రూపు రాజకీయాలతో నిండిన తమిళనాడు కాంగ్రెస్‌లో ఈ జాబితా చిచ్చు పెట్టింది. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద రెండు రోజులుగా పలు గ్రూపులు ఆందోళనలు చేస్తున్నాయి.  ఈ పరిస్థితుల్లో శనివారం అర్ధరాత్రి 21 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్‌ ప్రకటించింది. గ్రూపుల వివాదాలతో మిగిలిన  నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు.

సీట్ల కేటాయింపు
21 మంది జాబితాలో పలువురు కాంగ్రెస్‌ నేతలు తమ వారసులకు సీట్లు ఇప్పించుకున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ తన కుమారుడు తిరుమగన్‌ ఈవేరాకు ఈరోడ్‌(ఈస్ట్‌) సీటు, మరో సీనియర్‌ ఎంపీ తిరునావుక్కరస్‌ తన వారసుడు రామచంద్రన్‌కు అరంతాంగి సీటు ఇప్పించుకున్నారు. అలాగే తమిళనాడు కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత కేఆర్‌ రామస్వామి తన కుమారుడు ఆర్‌ఎం కరుమాణిక్యంకు తిరువాడనై సీటును ఇప్పించుకోగా, రంగరాజ కుమారమంగళం వారసుడు ఆర్‌ మోహన్‌కుమార మంగళంకు ఓమలూరు సీటును కేటాయించారు. ఇక విరుదునగర్‌ ఎంపీ మాణిక్‌ ఠాకూర్‌ తన మామ రవిచంద్రన్‌కు మేలూరు సీటు దక్కేలా చేసుకున్నారు. కాగా, హెచ్‌. వసంతకుమార్‌ మరణంతో ఖాళీగా ఉన్న కన్యాకుమారి లోక్‌ సభ సీటును ఆయన కుమారుడు విజయ్‌ కుమార్‌ అలియాస్‌ విజయ్‌ వసంత్‌కు కేటాయించారు.

చదవండి: నా కొడుకు రాజకీయాల్లోకి రాడు: కనిమొళి 

మరిన్ని వార్తలు