68 మందికి నేర చరిత్ర.. 157 మంది కోటీశ్వరులు

12 Mar, 2021 09:55 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై:  ‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అన్నట్లు రాజకీయనాయకుల్లో ఎమ్మెల్యేలు వేరు. ఈ ఎమ్మెల్యేల్లో సచ్చీలురులతోపాటు 68 మంది నేరగాళ్లు కూడా ఉన్నారనే సత్యాన్ని ఒక సర్వే బయటపెట్టింది. తమిళనాడు అసెంబ్లీలో 234 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జన నాయక సీర్‌తిరుత్త సంఘం, తమిళనాడు ఎన్నికల నిఘా సంయుక్తంగా చేపట్టిన సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూసాయి. అన్నికంటే ముఖ్యంగా రాష్ట్రంలోని 68 మంది ఎమ్మెల్యేలకు నేరచరిత్ర ఉన్నట్లు తేలింది.  2016–21 మధ్య కాలం నాటి ఎమ్మెల్యేల నేర నేపథ్యం, విద్యార్హత, ఆస్తి, అంతస్తులపై సర్వే చేశారు. నాలుగు స్థానాలు ఖాళీ, 26 మంది ఎమ్మెల్యేల నామినేషన్‌ పత్రాలు గల్లంతు కావడంతో 204 ఎమ్మెల్యేల గురించి సర్వే నిర్వహించారు.

వీరిలో 68 మంది నేరపూరిత కేసులను ఎదుర్కొంటునట్లు తేలింది. 8 మందిపై హత్య, హత్యాయత్నం, ఇద్దరిపై మహిళలకు వ్యతిరేకంగా వ్యవహరించిన నేరం కేసులున్నాయి. ఇక పార్టీ పరంగా పరిశీలిస్తే డీఎంకేలో 40, అన్నాడీఎంకేలో 23, కాంగ్రెస్‌లో 4, ఒక స్వతంత్య్ర ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులున్నాయి. 22 మంది డీఎంకే ఎమ్మెల్యేలు, 13 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఒక స్వతంత్య్ర ఎమ్మెల్యే తీవ్రమైన క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్నారు.  

మిస్టర్‌ ‘కోటీశ్వర్‌’.. 
ఇక 204 ఎమ్మెల్యేల్లో కోటీశ్వరుల జాబితాను పరిశీలిస్తే 157 మంది మిస్టర్‌ ‘కోటీశ్వర్‌’గా ముద్రపడ్డారు. అన్నాడీఎంకేలో 76, డీఎంకేలో 74, కాంగ్రెస్‌లో 5, ఇండియన్‌ ముస్లింలీగ్‌ ఒకరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే కోటీశ్వరుల జాబితాలో ఉన్నారు.  

89 మందికి పాఠశాల విద్యార్హత.. 
89 మంది ఎమ్మెల్యేలు 5–12 తరగతులు చదివారు. 110 మంది పట్ట భద్రులు, ముగ్గురు డిప్లొమా చదివిన వారున్నారు. చదవడం, రాయడం మాత్రమే తెలిసిన ఒక ఎమ్మెల్యే విద్యార్హతను ప్రకటించలేదు. 25–50 మధ్య వయస్కులు 78 మంది, 51–70 మధ్య వయస్కులు 125 మంది ఉన్నారు. వీరుగాక 77 ఏళ్ల వయస్సుగల ఎమ్మెల్యే ఒక్కరున్నారు.   

మరిన్ని వార్తలు