Tamil Nadu Assembly Election 2021: చిన్నమ్మ మద్దతు మాకే!

18 Mar, 2021 15:26 IST|Sakshi

సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ మానసిక ఆదరణ, మద్దతు అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగంకే అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దినకరన్‌ ధీమా వ్యక్తం చేశారు. దుష్టశక్తి డీఎంకేను, ద్రోహశక్తి అన్నాడీఎంకే పాలకుల్ని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకుంటామన్నారు.  దినకరన్‌ అమ్మమక్కల్‌ మున్నేట్ర కళగం, విజయకాంత్‌ డీఎండీకేతో పాటు ఎస్‌డీపీఐలు కూటమిగా ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కూటమి ఒప్పందాలు జరిగిన రోజున దినకరన్‌ చెన్నైలో లేరు. కోవిల్‌పట్టిలో నామినేషన్‌ దాఖలు చేసి చెన్నైకు వచ్చిన ఆయన మంగళవారం ఎన్నికల ప్రచారం శ్రీకారం చుట్టారు. ఈ పరిస్థితుల్లో బుధవారం కోయంబేడులోని డీఎండీకే కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆ పార్టీ నేత విజయకాంత్‌తో భేటీ అయ్యారు. అనంతరం దినకరన్‌ మీడియాతో మాట్లాడుతూ తమది విజయకూటమి అని ప్రకటించారు. 

దుష్టశక్తుల్ని రానివ్వం.. 
ఈ ఎన్నికల్లో డీఎండీకే 60, ఎస్‌డీపీఐ ఆరుచోట్ల పోటీ చేస్తున్నాయని దినకరన్‌  తెలిపారు. డీఎండీకే కూటమిలోకి రాగానే, ముందుగా తాను ప్రకటించిన 42 మంది పార్టీ అభ్యర్థులు స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారని వివరించారు. ఆ మేరకు ఆర్మీ కట్టుబాట్లతో తమ కేడర్‌ ఉన్నారని పేర్కొన్నారు. విజయకాంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశానని పేర్కొంటూ, తమ ఇద్దరి సిద్ధాంతం లక్ష్యం ఒక్కటే అన్నారు. డీఎంకే, అన్నాడీఎంకే  అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవడమేనని స్పష్టం చేశారు. 

చదవండి: 
ఎన్నికలకు దూరంగా రజనీకాంత్‌ స్నేహితుడు

కమల్‌ సీఎం కావడం ఖాయం..

మరిన్ని వార్తలు