టీటీవీ దినకరన్‌తో ఒవైసీ పొత్తు..

9 Mar, 2021 15:06 IST|Sakshi

టీటీవీ దినకరన్‌ రెండు చోట్ల పోటీ 

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మజ్లిస్‌ పార్టీ సిద్ధమైంది. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం(ఏఎమ్‌ఎమ్‌కే)తో జట్టుకట్టింది. కాగా ఏఎమ్‌ఎమ్‌కే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. అయితే స్థానాల పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఇక ఓవైసీ నాయకత్వంలోని ఏఐఎంఐఎం, కూటమిలో చేరి కృష్ణగిరి, శంకరాపురం, వానియంబాడి నుంచి పోటీ చేస్తోంది.

ఓవైసీ పార్టీకి సీట్ల కేటాయింపుపై హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఐదుగురితో కూడిన బృందం సోమవారం చర్చలు చేపట్టింది. కమల్‌హాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యం, ఐజేకే, సమక ఒక కూటమిగా ఏర్పడింది. చెన్నై ఆలందూరు సీటును కమల్‌హాసన్‌ దాదాపు ఖరారు చేసుకున్నారు. తన వాగ్దానాలను డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ కాపీ కొడుతున్నారని కమల్‌ ప్రచారాల్లో ఎద్దేవా చేస్తున్నారు. తమ కూటమి వివరాలను రెండు రోజుల్లో ప్రకటిస్తానని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ సోమవారం తెలిపారు.  

178 స్థానాల్లో పోటీచేయనున్న డీఎంకే 
డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు దాదాపు పూర్తయింది. మొత్తం 234 స్థానాల్లో 178 నియోజకవర్గాల్లో డీఎంకే పోటీ చేయనుంది. మిగిలిన వాటిలో ఇండియన్‌ ముస్లిం లీగ్, మనిదనేయ మక్కల్‌ కట్చి– 2, సీపీఐ– 6, ఎండీంకే– 6, వీసీకే– 6 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. సుదీర్ఘ మంతనాల తర్వాత కాంగ్రెస్‌కు 25 సీట్లు కేటాయించారు. అలాగే కన్యాకుమారి లోక్‌సభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. మరోవైపు సీపీఐ నేతలతో స్టాలిన్‌ సోమవారం చర్చలు జరిపి ఆరు సీట్లను ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన అంగీకార పత్రాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌కు అందజేశారు. అలాగే తమిళగ వాళ్వురిమై కట్చికి ఒక సీటు ఖరారు చేశారు. డీఎంకేకు మద్దతిస్తున్నట్లు కరుణాస్‌ నాయకత్వంలోని ముకుల్తోర్‌ పులిపడై, తమీమున్‌ అన్సారీ నేతృత్వంలోని జననాయక కట్చి, అదిత తమిళర్‌ పేరవై, ఇండియ తవ్‌హీద్‌ జమాత్‌ ప్రకటించాయి.  

చదవండిఅన్నాడీఎంకే- బీజేపీ కూటమి నుంచి మిత్రపక్షం అవుట్‌‌‌! 

మరిన్ని వార్తలు