వీరప్పన్‌ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌కు షాకిచ్చిన డిపార్ట్‌మెంట్‌

20 Mar, 2021 12:48 IST|Sakshi

ఎన్నికల చిత్రాలు: భార్య పోటీ.. భర్త బదిలీ 

సాక్షి, చెన్నై: ఎన్నికల్లో భార్య పోటీ చేస్తుండడం ఓ పోలీసు అధికారిని ఇరకాటంలో పడేసింది. ఆయన్ను బదిలీ చేస్తూ, ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ పోలీసు బాసుల నిర్ణయం తీసుకున్నారు. తిరునల్వేలి జిల్లా అంబాసముద్రం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం అభ్యర్థిగా రాణిరంజితం పోటీ చేస్తున్నారు. ఆమె నామినేషన్‌ దాఖలు, ప్రచారంలో బిజీ అయ్యారు. ఈ పరిస్థితుల్లో అదే జిల్లాలో నగర అదనపు కమిషనర్‌గా ఆమె భర్త వెల్లదురై పనిచేస్తుండడంతో రచ్చకెక్కింది. 

చందనపు దొంగ వీరప్పన్‌ ఎన్‌కౌంటర్‌ టీంలో కీలక పాత్ర పోషించడమే కాదు, అనేక ఎన్‌కౌంటర్‌లతో ఎన్‌కౌంటర్‌ వెల్లదురైగా పేరు గడించిన ఈ అధికారికి భార్య రూపంలో విధి నిర్వహణలో చిక్కులు తప్పలేదు. దీంతో తిరునల్వేలి కమిషనర్‌ అన్బు ఆయన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, అధికార అన్నాడీఎంకే నుంచి చీలిన అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగంలో ఈ అధికారి సతీమణి పోటీ చేస్తుండడం కాబోలు, ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వకుండా చెన్నై డీజీపీ కార్యాలయంలో ఎన్నికల విధులకు దూరంగా ఓ మూలన కూర్చోబెట్టడం గమనార్హం.

శ్రీరంగంలో చిన్నమ్మ పూజలు 
సాక్షి, చెన్నై: తిరుచ్చి శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో శుక్రవారం చిన్నమ్మ శశికళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, సమయపురం మారియమ్మన్‌ ఆలయాన్ని కూడా సందర్శించారు. పరప్పన అగ్రహార చెర నుంచి చెన్నైకు వచ్చిన 41 రోజుల తర్వాత ఇంటి నుంచి శశికళ అడుగు బయటపెట్టారు. గురువారం తంజావూరులోని కులదైవం ఆలయంలో పూజలు నిర్వహించారు. శుక్రవారం తిరుచ్చి శ్రీరంగం చేరుకుని రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ పూజల అనంతరం మధ్యాహ్నం తిరుచ్చిలోని బంధువు కళియ పెరుమాల్‌ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం సమయపురం మారియమ్మన్‌ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు.

శనివారం చిన్నమ్మ భర్త నటరాజన్‌ మూడో వర్ధంతి. ఈసందర్భంన్ని పురస్కరించుకుని తంజావూరు ముల్‌లైవాయికాల్‌ స్తూపం ఎదురుగా ఉన్న నటరాజన్‌ సమాధి వద్ద చిన్నమ్మ నివాళులర్పించే అవకాశాలు ఉన్నాయి. చిన్నమ్మ తిరుచ్చి ఆలయ సందర్శన సమయంలో ఆమె వెన్నంటి అన్న కుమారుడు వెంకటేషన్‌ మాత్రమే ఉన్నారు. ఒకప్పుడు వీవీఐపీగా ఆలయ సందర్శనకు వచ్చిన శశికళ ఇప్పుడు సాదాసీదా వ్యక్తిగా వెళ్లి దర్శించుకుని వచ్చారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు