కోయంబత్తూర్‌ సౌత్‌ నుంచి కమల్.. ప్రధాన కారణం అదేనట

12 Mar, 2021 16:21 IST|Sakshi

పొత్తుల్లో భాగంగా బీజేపీ చేతికి కోయంబత్తూర్‌ సౌత్‌

చెన్నై: తమిళనాట రాజకీయ వాతావరణం క్రమంగా హీటెక్కుతోంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలన్నీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నటుడు, మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) పా​ర్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ కోయంబత్తూర్‌ సౌత్‌ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తన పార్టీ రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా కమల్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తాను కోయంబత్తూర్‌ సౌత్‌ నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. తొలుత కమల్‌ చెన్నై, అలందూర్‌ నుంచి పోటీ చేయాలని భావించినప్పటికి చివరకు కోయంబత్తూరు నుంచి బరిలో దిగేందకు సిద్ధమయ్యారు. 

ఈ సందర్భంగా కమల్‌ మాట్లాడుతూ.. ‘‘మా నాన్న నన్ను ఐఏఎస్‌ అధికారిగా చూడాలనుకున్నారు. ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఆశపడ్డారు. కాకపోతే నేను ఆయన కలను నిజం చేయలేకపోయాను. అందుకే మా పార్టీలోకి ఎక్కువ మంది ఐఏఎస్‌ అధికారులను ఆహ్వానించాను. వారికే సీట్లు కేటాయించాను. ఇది నాకు ఎంతో గర్వకారణం’’ అన్నారు. ఇక కమల్‌ నేడు ప్రకటించిన రెండో జాబితాలో డాక్టర్‌ సుభా చార్లేస్‌ ‘కన్యాకుమారి), డాక్టర్ ఆర్ మహేంద్రన్ (సింగనల్లూర్), డాక్టర్ సంతోష్ బాబు (వెలాచేరి), మరియు పాజా కరుపయ్య (టి నగర్) నుంచి పోటీ చేయనున్నారు. అలందూర్‌ స్థానాన్ని శరద్ బాబుకు కేటాయించారు.

గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు సౌత్‌లో ఏఐడీఏంకే తరఫున అమ్మన్‌ కే అర్జున్‌ విజయం సాధించారు. తాజాగా పొత్తుల్లో భాగంగా ఏఐడీఎంకే పార్టీ ఈ స్థానాన్ని మిత్ర పక్షం బీజేపీకి కేటాయించింది. అయితే దీనిపై ఏఐడీఏంకే కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇక 2019 జనరల్‌ ఎలక్షన్‌లో ఎంఎన్‌ఎం కోయంబత్తూరు నియోజకవర్గంలో 11 శాతం ఓట్లు సాధించగలిగింది. ఇక్కడ పార్టీకి మద్దతురాలు ఎక్కువ ఉండటం.. ప్రస్తుత ఎన్నికల్లో ఏఐడీఎంకే కాకుండా బీజేపీ కోయంబత్తూరులో బరిలో నిలవడం వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే కమల్‌ ఇక్కడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 

చదవండి: మూడో కూటమి సీఎం అభ్యర్థిగా కమల్ ఖరారు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు