Annamalai:దుమారం రేపుతున్న బీజేపీ యంగ్‌ ఛీఫ్‌ ప్రసంగం! పరిణితి లేని వ్యాఖ్యలంటూ..

16 Jul, 2021 14:19 IST|Sakshi

తమిళనాడు బీజేపీ పార్టీ కొత్త అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్‌ అన్నామలై చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఆరు నెలల్లోగా మీడియా మొత్తం పార్టీ చెప్పుచేతల్లోకి వచ్చేస్తోందని ఈ యువ నేత చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీస్తోంది. 

చెన్నై: ‘‘మీడియాను నియంత్రిస్తాం. రాబోయే ఆరు నెలల్లో పూర్తిగా మన చెప్పుచేతుల్లోకి తెచ్చుకోబోతున్నాం. కాబట్టి, ఎవరూ బాధపడకండి. నిరాధారమైన వార్తలు ఎల్లకాలం మనల్ని ఇబ్బంది పెట్టలేవు. మన పార్టీ మాజీ అధ్యక్షుడు.. సమాచార ప్రసార శాఖ మంత్రి అయ్యాడు. అన్ని మీడియా హౌజ్‌లు ఇక ఆయన కిందే ఉంటాయి. తప్పులు ఎల్లకాలం జరగవు. వాటితో ఎల్లకాలం మీరు రాజకీయాలు చేయలేరు’ అంటూ అన్నామలై మాట్లాడిన వీడియో ఒకటి సర్క్యూలేట్‌ అయ్యింది. 

అన్నామలైని పార్టీ ఛీప్‌గా నియమించాక.. కొయంబత్తూరు నుంచి చెన్నైకి పార్టీ కేడర్‌తో చేరుకున్నాడు. కరోనా టైంలో ఈ టూర్‌ అధికారులకు పెద్ద తలనొప్పి అయ్యింది. దీంతో మీడియా హౌజ్‌లు ఈ యువ నేత పర్యటన మీద విమర్శనాత్మక కథనాలు ప్రసారం చేశాయి. అయితే తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని.. రాబోయే ఆరు నెలల్లో మీడియా మన చేతికి వస్తుందని ఆ బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడాడు అన్నామలై.  తమిళనాడు బీజేపీ ఛీఫ్‌గా పని చేసిన ఎల్‌ మురుగన్‌.. ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణలో  సమాచార ప్రసార మంత్రిగా(మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌-డిప్యూటీ హోదా)గా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యాన్ని ఊటంకిస్తూ వ్యాఖ్యలు చేశాడు అన్నామలై.

ఇక ఈ కామెంట్లను తమిళనాడు ఐటీ శాఖ మంత్రి మనో త్యాగరాజన్‌ ఖండించాడు. అన్నామలైవి పరిణితి లేని వ్యాఖ్యలని మండిపడ్డాడు. మీడియా ఏ ఒక్క పార్టీ సొత్తో కాదని, ఆయన అలా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని మంత్రి పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రాజకీయ విమర్శలు రావడంతో.. అన్నామలై ​స్పందించాడు. తాను ‘ఫేక్‌ న్యూస్‌ కట్టడి’, రాబోతున్న ఐటీ యాక్ట్‌ గురించి ఉద్దేశించి అలా మాట్లాడనని.. మీడియాను పార్టీ నియంత్రిస్తుందన్న కోణంలో తాను మాట్లాడలేదని అన్నామలై స్పష్టం చేశాడు.

ట్విటర్‌ ట్రెండ్‌లో యువరక్తం
తమిళనాడు కరూరు జిల్లా వ్యవసాయ కుటుంబానికి చెందిన అన్నామలై.. మెకానికల్‌ ఇంజినీరింగ్‌, లక్నో ఐఐఎంలో ఎంబీఏ చదివాడు. 2011 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఈయన కర్ణాటకలో ఆయన విధులు నిర్వహించినప్పుడు ‘సింగం’గా పేరుండేది. 2018-19 టైంలో కీలక బాధ్యతలు చేపట్టాడు కూడా. అయితే అనూహ్యంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. బీజేపీలో చేరాడు. మొన్నటి తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు కూడా. అయితే యువ రక్తం కావడం, జనాల్లో క్రేజ్‌ ఉండడంతో 37 ఏళ్లకే బీజేపీ అతన్ని పార్టీ ఛీఫ్‌గా నియమించింది. ఈయనకి ఉన్న క్రేజ్‌ ఎట్లాంటిదంటే.. ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో ‘తమిళనాడు కోసం అన్నామలై’ #Annamali4TN హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌ టాప్‌లో కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు