ఎన్నికల ప్రచారం: కమల్‌ హాసన్‌పై కేసు 

5 Apr, 2021 09:20 IST|Sakshi

పరస్పర దూషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రెండు నెలలపాటు హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమాప్తమైంది. చివరి రోజు ఆదివారం అన్నిపార్టీలూ సుడిగాలి ప్రచారం సాగించాయి. నేతల ఉపన్యాసాలతో హోరెత్తిన మైకులు, లౌడ్‌స్పీకర్లు రాత్రి 7 గంటల తరువాత ఒక్కసారిగా మూగబోయాయి. 

సాక్షి, చెన్నై:  హిందువులు ఆరాధించే దేవుళ్లను ప్రచారంలో వాడుకున్న అభియోగంపై ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కోయంబత్తూరు దక్షిణం నుంచి పోటీచేస్తున్న కమల్‌ ప్రచార వాహనంలో శ్రీరాముడు, అమ్మవారి వేషాలతో ఉన్న వ్యక్తులు కమల్‌ పార్టీ పతాకాన్ని పట్టుకుని ప్రయా ణించారు. వీరిద్దరూ మన దేవుళ్లే, అయితే వీరిని అడ్డుపెట్టుకుని కొందరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. దీనిపై కొందరు ఫిర్యాదు చేయడంతో కమల్‌ సహా ముగ్గురిపై కాట్టూరు పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు పెట్టారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో అన్నాడీఎంకే–బీజేపీ, డీఎంకే–కాంగ్రెస్‌ కూటములు సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం సాగించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ అగ్రనేతలు తమిళనాడుకు తరలివచ్చారు. అధికార కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్రమంత్రులు స్మృతీఇరానీ, నిర్మలా సీతారామన్‌ తీవ్రస్థాయిలో ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే ప్రతిపక్ష కూటమిని బలపరుస్తూ ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ, కర్ణాటక సీనియర్‌ నేత వీరప్పమెయిలీ ప్రచారం చేశారు. తమిళనాడులో ఈనెల 3వ తేదీన తొలిసారి ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక పర్యటన రద్దయింది. ఇక స్థానికంగా అన్నాడీఎంకే రథ సారథులైన సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం తమ నియోజకవర్గాలతోపాటు ఒకరి నియోజకవర్గంలో ఒకరు ప్రచారం చేశారు.

చదవండి: అలా అయితే సినిమాలు మానేస్తా: కమల్‌ హాసన్‌

కూటమి అభ్యర్థులకు మద్ధతుగా అనేక నియోజకవర్గాల్లో పర్యటించారు. డీఎంకే అధ్యక్షులు స్టాలిన్‌ సైతం తీవ్రస్థాయిలో ప్రచారం సాగించారు. ఎన్నికల షెడ్యూలు విడుదల కాకముందే ప్రజలను ఆకట్టుకునేందుకు ‘మీ నియోజకవర్గంలో స్టాలిన్‌’ పేరున సభలు నిర్వహించారు. ఐజేకే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ అదే కూటమికి చెందిన సమత్తువ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు శరత్‌కుమార్, ఆయన సతీమణి రాధికతో కలిసి ప్రచారం సాగించారు. కమల్‌ కుమార్తె అక్షర, అన్న కుమార్తె నటి సుహాసిని సైతం నడిరోడ్డుపై నృత్యంతో ప్రచారాన్ని రక్తికట్టించారు. ఇక అన్నాడీఎంకే అసంతృప్త ఓట్లపైనే ఆధారపడి బరిలోకి దిగిన అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ పెద్ద ఎత్తున ప్రచారం సాగించారు. అన్నాడీఎంకే శ్రేయస్సును కోరి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు జయలలిత నెచ్చెలి శశికళ ప్రకటించినా ఆమె అన్న కుమారుడు దినకరన్‌ పోటీకి దిగడం గమనార్హం.

చదవండి: కమల్‌ హాసన్‌ కూతురితో నటి తీన్మార్‌ స్టెప్పులు! 

నేతల తుది పిలుపు 
అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరిరోజు ఆదివారం  ప్రధాన పార్టీ నేతలు ఓటర్లకు తుది పిలుపునిచ్చారు. ఎండలు మండిపోతున్నా చిరునవ్వు చిందిస్తూ ఓపెన్‌టాప్‌ వాహనంలో ప్రయాణించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కన్యాకుమారి, తిరునల్వేలి, చెన్నై జిల్లాల్లో పర్యటించారు. అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించాలని సేలంలో సీఎం ఎడపాడి అన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు ఎడపాడిని కలిసి మద్దతు ప్రకటించారు. రేపటి ఎన్నికల పోలింగ్‌లో ప్రజలు అన్నాడీఎంకే ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఓటు వేస్తారని పేర్కొంటూ చెన్నైలో స్టాలిన్‌ ప్రచారం చేశారు.                      
జేపీ నడ్డా ప్రచారంలో కమల్‌ పాట 
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కన్యాకుమారి లో ఆదివారం ప్రచారం చేశారు. ఈ సమయంలో స్థానిక అన్నాడీఎంకే కార్యకర్తలు హిందీ పాటలను మైకుల ద్వారా ప్రసారం చేశారు. అయితే అకస్మాత్తు గా కమల్‌హాసన్‌ హీరోగా నటించిన పున్నగైమన్నన్‌ చిత్రంలోని ‘ఎన్న సత్తం ఇంద నేరం’ (ఇలాంటి సమయంలో ఏమిటీ శబ్దం) అనే పాట ప్రసారం కావడంతో అందరూ బిత్తరపోగా, బీజేపీ కార్యకర్తలు తేరుకుని వెంటనే ఆపాట ఆపండి అంటూ కేకలు వేయడంతో ఆగిపోయింది. 

ప్రచారం చేస్తే రెండేళ్ల జైలు: ఈసీ 
ప్రచార పర్వం ముగిసి ఈనెల 6వ తేదీన పోలింగ్‌ జరగనున్న దృష్ట్యా పార్టీ పనుల నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతో స్వస్థలాలకు వెళ్లిపోవాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. లాడ్జీలు, అతిథిగృహాలు, కల్యాణమండపాల్లో బసచేసిన ఉన్న వారు ఖాళీ చేయాలని కోరింది. గడువు ముగిసిన తరవాత ప్రచారం చేసిన వారికి రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తామని ఈసీ హెచ్చరించింది.   

మరిన్ని వార్తలు