Mekedatu Project అడ్డుకోవాల్సిందే.. అఖిలపక్ష తీర్మానం

13 Jul, 2021 08:18 IST|Sakshi

అఖిలపక్ష సమావేశంలో తీర్మానం

ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలవాలని నిర్ణయం 

సాక్షి ప్రతినిధి, చెన్నై : కావేరీ నదిపై మేఘదాతు ఆనకట్ట నిర్మాణానికి అడ్డుకట్ట వేయడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని తమిళనాడులోని అఖిలపక్ష పార్టీలు నిర్ణయించాయి. కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం హ డావుడిగా మేఘదాతు ఆనకట్ట నిర్మాణం చేప్పడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అధ్యక్షతన సోమ వారం అఖిలపక్ష సమావేశం జరిగింది. చెన్నై సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, బీజేపీ తదితర 13 పార్టీల నేతలు పాల్గొని మేఘదాతును అడ్డుకునేందుకు తమిళనాడు ప్రభు త్వం చేస్తున్న ప్రయత్నాలకు సంఘీభావం తెలిపారు.  

ప్రధాని దృష్టికి.. 
చట్టపరంగా ఈ ప్రయత్నాలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతోంది. సీఎం స్టాలిన్‌ ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలిసి కర్ణాటక ప్రభుత్వం చర్యలను నిలువరించాలని, తమిళనాడు రైతుల సాగునీటి ప్రయోజనాలను కాపాడాలని కోరారు. మేఘదాతు ఆనకట్ట నిర్మాణాన్ని తమిళనాడు వ్యతిరేకించరాదని కర్ణాటక సీఎం యడ్యూరప్ప సీఎం స్టాలిన్‌కు ఇటీవల లేఖ రాశారు. మరోవైపు ఆనకట్ట వల్ల తమిళనాడులోని వ్యవసాయ భూములకు సాగునీరందక దెబ్బతింటాయని, పైగా ఆనకట్ట నిర్మాణం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని స్టాలిన్‌ ఆ లేఖకు బదులిచ్చారు. మేఘదాతు ఆనకట్టను ఎంతమాత్రం అంగీకరించబోమని స్టాలిన్‌ స్పష్టం చేశారు.

కర్ణాటక ప్రభుత్వ దూకుడుకు కళ్లెం వేసేందుకు తమిళనాడులోని అన్ని పార్టీలను సంఘటితం చేస్తూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి దురైమురుగన్, ఆర్‌ఎస్‌ భారతి (డీఎంకే), అన్నాడీఎంకే నుంచి మాజీ మంత్రి జయకుమార్, మనోజ్‌ పాండియన్, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, చెల్లపెరుందగై, జీకే మణి (పీఎంకే), నయనార్‌ నాగేంద్రన్‌ (బీజేపీ) ఎంపీ తిరుమా (వీసీకే) సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు, తదితర 13 పార్టీల నేతలు పాల్గొన్నారు. కర్ణాటక ప్రభుత్వ వైఖరిని, మేఘదాతు ఆనకట్ట నిర్మాణాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలని తీర్మానం చేశారు. తమిళనాడు ప్రభుత్వం తరఫున అఖిలపక్ష బృందం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కావాలని నిర్ణయించారు. కావేరీ నదిపై తమిళనాడు హక్కులను నిర్ధారించాలని, మేఘదాతు ఆనకట్ట నిర్మాణాన్ని ఎంతమాత్రం అనుమతించకుండా కేంద్రాన్ని ఒత్తిడి చేయాలని నిర్ణయించారు.   

మరిన్ని వార్తలు